Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జోషిమఠ్‌ కుంగిపోతోంది

. 12 రోజుల్లో 5.4 సెం.మీ భూమి క్షీణత
. ఇస్రో ప్రాథమిక నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పట్టణం జోషిమఠ్‌ శరవేగంగా కుంగిపోతోందని శాస్త్రీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విడుదల చేసిన ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని వెల్లడిరచాయి. జనవరి 2న చోటుచేసుకున్న క్షీణత కారణంగా హిమాలయ పట్టణం కేవలం 12 రోజుల్లో 5.4 సెంటీమీటర్ల వేగంతో మునిగిపోయిందని చూపిస్తుంది. బద్రీనాథ్‌, హేమ్‌కుండ్‌ సాహిబ్‌, అంతర్జాతీయ స్కీయింగ్‌ గమ్యస్థానం ఔలి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రవేశ ద్వారం అయిన జోషిమఠ్‌ భూమి క్షీణత కారణంగా పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఇస్రోకు చెందిన జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ప్రాథమిక అధ్యయనం ప్రకారం ఏప్రిల్‌నవంబరు 2022 మధ్య భూమి క్షీణత నెమ్మదిగా ఉంది. ఈ సమయంలో జోషిమఠ్‌ 8.9 సెం.మీ కుంగిపోయింది. కానీ డిసెంబరు 27, 2022జనవరి 8, 2023 మద్య భూమి క్షీణత తీవ్రత పెరిగింది. ఈ 12 రోజుల్లో పట్టణం 5.4 సెం.మీ కుంగింది. కార్టోశాట్‌-2ఎస్‌ ఉపగ్రహం నుంచి ఈ చిత్రాలను తీశారు. ‘కొన్ని రోజుల వ్యవధిలో ఈ ప్రాంతం దాదాపు 5 సెం.మీ క్షీణించింది. క్షీణత ప్రాంత పరిధి కూడా పెరిగింది. కానీ అది జోషిమఠ్‌ పట్టణం మధ్య భాగానికి మాత్రమే పరిమితమైంది’ అని ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదిక పేర్కొంది. కాగా సాధారణ కొండ చరియల ఆకారాన్ని పోలి ఉండే ఒక క్షీణత ప్రాంతాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఇది పై భాగంలో కుచించుకుపోయి, కింది భాగానికి విస్తరించి ఉందని, 2,180 మీటర్ల ఎత్తులో జోషిమఠ్‌-ఔలీ రహదారికి సమీపంలో క్షీణత కిరీటం ఉందని నివేదిక పేర్కొంది. జోషిమఠ్‌ పట్టణం మధ్య భాగంలో విస్తరించి ఉన్న క్షీణత ప్రాంతంలో ఆర్మీ హెలిప్యాడ్‌, నరసింహ దేవాలయం ప్రముఖ మైలురాళ్లుగా చిత్రాలు చూపిస్తున్నాయి. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, ఆర్‌కే సింగ్‌, భూపేంద్ర యాదవ్‌, గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరైన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం జోషిమఠ్‌లో పరిస్థితిని, ప్రజల కష్టాలను తీర్చేందుకు తీసుకున్న చర్యలను అంచనా వేశారు. 589 మంది సభ్యులతో కూడిన మొత్తం 169 కుటుంబాలను ఇప్పటివరకు సహాయ కేంద్రాలకు తరలించారు. జోషిమఠ్‌, పిపల్‌కోటిలో 835 గదులు సహాయ కేంద్రాలుగా పని చేస్తున్నాయి. వీటిలో 3,630 మంది వ్యక్తులు ఆశ్రయం పొందవచ్చు. అలాగే 42 బాధిత కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.1.5 లక్షల మధ్యంతర సాయాన్ని అందించారు. అందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జోషిమఠ్‌లో బాధిత కుటుంబాలకు చెల్లించాల్సిన నష్టపరిహారం కోసం మార్కెట్‌ రేటును కమిటీ నిర్ణయిస్తుందని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి గురువారం తెలిపారు. ఇదిలాఉండగా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో భూమి కూడా ఏటా కొంత మేరకు కుంగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. జోషిమఠ్‌ చుట్టుపక్కల ప్రాంతాలు ఏటా 2.5 అంగుళాల మేరకు భూమిలోకి దిగిపోతున్నట్లు డెహ్రాడూన్‌లోని జాతీయ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ గుర్తించింది. జులై 2020 నుంచి మార్చి 2022 వరకు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించి, ఇక్కడి లోయ ప్రదేశం మొత్తం నెమ్మదిగా కుంగిపోతున్నట్లు కనుగొంది. జోషిమఠ్‌లో పరిస్థితికి ఎన్‌టీపీసీ ప్రాజెక్టు కారణమని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పర్వతాలతో నిండిన రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో జోషిమఠ్‌ లాంటి పరిస్థితే… మరికొన్ని కీలక నగరాలు, గ్రామాల్లో ఉంది. పౌరి, ఉత్తర కాశీ, బాగేశ్వర్‌, టహరి గఢవాల్‌, రుద్రప్రయోగ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. జోషిమఠ్‌ పరిస్థితి చూసి ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. టహరి జిల్లాలోని అటలి గ్రామం నుంచి రిషికేశ్‌కర్ణప్రయోగ్‌ రైల్వే లైన్‌పై వెళుతుంది. ఇది నరేంద్ర నగర్‌ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ తరచూ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇళ్లు పగుళ్లిచ్చాయి. ఇక్కడ టన్నెల్‌ పనుల కోసం పేలుళ్లు చేపట్టడం కూడా సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. ఇప్పటికే జిల్లా మేజిస్ట్రేట్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక పౌరి విషయానికొస్తే ఇక్కడ నిర్మిస్తున్న రైల్వే ప్రాజెక్టు కారణంగా ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. బాగేశ్వర్‌లో కోప్‌కోట్‌ వద్ద కర్‌బగ్డ్‌ గ్రామంపై నిర్మించిన హైడ్రోపవర్‌ ప్రాజెక్టు టన్నెల్‌కు రంధ్రాలు పడి నీరు లీకవుతోంది. దీంతో గ్రామస్తులు జలప్రళయం ఎప్పుడు వస్తుందోనని భయపడుతున్నారు. అలాగే ఉత్తరకాశీలో తరచూ కొండచరియలు విరిగి పడుతున్నాయి. మరోవైపు, రుద్రప్రయోగ్‌ విషయానికొస్తే, రిషికేశ్‌కర్ణప్రయాగ్‌ రైల్వే లైన్‌ సొరంగ నిర్మాణంతో ఇక్కడి మరోడ గ్రామంలో చాలా ఇళ్లు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి.
పట్టణానికి కిలో మీటరు దూరంలోనే జల విద్యుత్‌ ప్రాజెక్టు : ఎన్‌టీపీసీ
తపోవన్‌ విష్ణుగడ్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టుకు అనుసంధానించబడిన 12 కిలోమీటర్ల పొడవైన సొరంగం జోషిమఠ్‌ పట్టణానికి 1 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ ప్రాంతంలోని భూమి క్షీణించడంలో తమ ప్రాజెక్టు పాత్ర లేదని ప్రభుత్వ యాజమాన్యంలోని ఎన్‌టీపీసీ విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు తెలిపింది. జనవరి 10న కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ జోషిమఠ్‌లో మునిగిపోయిన ఘటనపై సమీక్షించేందుకు ఎన్‌టీపీసీ అధికారులను పిలిపించింది. ఒక రోజు తర్వాత, భారతదేశపు అతిపెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ తన వైఖరిని వివరిస్తూ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
తపోవన్‌ విష్ణుగడ్‌ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్‌ ఉత్పత్తి కోసం డ్యామ్‌ ప్రాంతంలోని నీటిని విద్యుత్‌ కేంద్రానికి అనుసంధానించే హెడ్‌ ట్రేస్‌ టన్నెల్‌ (హెచ్‌ఆర్‌టి) ‘జోషిమఠ్‌ పట్టణం కిందకు వెళ్లడం లేదు’ అని వివరించింది. ‘సొరంగం జోషిమఠ్‌ పట్టణం వెలుపలి సరిహద్దు నుంచి 1.1 కి.మీ దూరంలో, నిలువుగా నేల మట్టానికి 1.1 కి.మీ దిగువన క్షితిజ సమాంతర దూరంలో ఉంది’ అని ఎన్‌టీపీసీ లేఖలో రాసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img