Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టాలీవుడ్‌లో విషాదం, సీనియర్‌ నటుడు బాలయ్య కన్నుమూత

సీనియర్‌ నటుడు మన్నవ బాలయ్య (92) కన్నుమూశారు. హైదరాబాద్‌, యూసఫ్‌గూడలోని గల ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మన్నవ బాలయ్య కంటే ఎమ్‌. బాలయ్యగా ఆయన సుపరిచితులు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురములో గ్రామం. ఆయన డిగ్రీ (బి.ఈ) చేశారు. ఆ తర్వాత కొన్నాళ్ళు కాకినాడ కాలేజీ, మద్రాసు పాలిటెక్నిక్‌ కాలేజీలో లెక్చరర్‌గా పాఠాలు బోధించారు. ఖాళీ సమయాల్లో నాటకాలు వేసేవారు. స్నేహితులందరూ హిందీ సినిమా హీరోలా ఉన్నావని ప్రశంసిస్తూ, ప్రోత్సహించడంతో సినిమాల్లోకి వచ్చారు. ‘ఎత్తుకు పైఎత్తు’ చిత్రంతో బాలయ్య కథానాయకుడిగా పరిచయం అయ్యారు. కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా… సరైన విజయాలు దక్కలేదు. దాంతో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారారు. ఎన్టీఆర్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ‘ఇరుగు – పొరుగు’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పాండవ వనవాసం’, ‘వివాహ బంధం’, ‘శ్రీక్రిష్ణ పాండవీయం’, ‘నేనే మొనగాణ్ణి’ – ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన పౌరాణిక, జానపద, సాంఫీుక చిత్రాల్లో బాలయ్య నటించారు. ‘నేనే మొనగాణ్ణి’లో ఆయన విలన్‌ వేషం వేశారు. సుమారు 300కి పైగా చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’లో అగ్గిరాజు పాత్ర ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. బాలయ్య నటుడు మాత్రమే కాదు… రచయిత, దర్శకుడు, నిర్మాత కూడా! శోభన్‌ బాబు కథానాయకుడిగా కె. విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘చెల్లెలి కాపురం’ సినిమా నిర్మించారు. ఆ చిత్రానికి గొల్లపూడి మారుతి రావుతో కలిసి కథ రాశారు. ‘చెల్లెలి కాపురం’ ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకుంది. నిర్మాతగా ఆయనకు నంది వచ్చింది. ఆ తర్వాత విశ్వనాథ్‌ దర్శకత్వంలో కృష్ణ హీరోగా ‘నేరము – శిక్ష’ నిర్మించారు. చిరంజీవితో హీరోగా స్వీయ దర్శకత్వంలో ‘ఊరికిచ్చిన మాట’ చిత్రాన్ని నిర్మించారు. దీనికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. నందమూరి బాలకృష్ణ ‘శ్రీరామరాజ్యం’ సినిమా నటుడిగా ఎమ్‌. బాలయ్యకు చివరి సినిమా. అందులో వసిష్ఠుని పాత్రలో కనిపించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img