Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

టిడ్కో ఇళ్లు ఇవ్వాల్సిందే

జగన్‌ సర్కారు పక్కా దగా
వచ్చేనెల మొదటి వారం`110 పట్టణాలలో రౌండుటేబుళ్లు
20న చలో మున్సిపల్‌ ఆఫీస్‌
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
వైసీపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలు: టీడీపీ నేత ఆలపాటి
ఐక్య పోరాటాలే శరణ్యం: సీపీఐ రౌండుటేబుల్‌లో వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలకు అన్ని మౌలిక వసతులు పూర్తి చేసి, లబ్దిదారులకు కేటాయించాలని డిమాండు చేస్తూ సెప్టెంబరు మొదటి వారంలో 110 పట్టణాలలో రౌండుటేబుల్‌ సమావేశాలు, 20న చలో మున్సిపల్‌ ఆఫీస్‌ వంటి కార్యక్రమాలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. విజయవాడలోని దాసరి భవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యాన టిడ్కో గృహ సముదాయాలకు మౌలిక వసతులు కల్పించాలని, సత్వరమే వాటిని లబ్ధిదారులకు స్వాధీనపరచాలని డిమాండు చేస్తూ సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ అధ్యక్షతన మంగళవారం రౌండుటేబుల్‌ సమావేశాన్ని నిర్వ హించారు. రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ అధికారం లోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇంకా టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వకపోవడం దారుణమని, ఇది పక్కా మోసపూరితనమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో 110 పట్టణాలు, నగరాలలో 7,58,788 లక్షల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింద న్నారు. 2019 ఫిబ్రవరి నాటికి చాలా ఇళ్లు పూర్తవ్వగా, మరికొన్ని ఇళ్లు తుది దశకు చేరాయని వివరించారు. గత ప్రభుత్వం 3.19లక్షల గృహ నిర్మాణాలను చేపట్టిందని, అనంతరం అధికారంలోకి వైసీపీ రాగానే అందులోని 57వేల ఇళ్లను రద్దు చేసిందని గుర్తుచేశారు. రూ.13వేల కోట్ల వ్యయంతో మిగిలిన 2.62లక్షల ఇళ్లను మూడు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు. నాడు జగన్‌ ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లను ఉచితంగా లబ్ధిదారులకు ఇస్తామని, డిపాజిట్‌ సొమ్ము తిరిగి చెల్లింపు, బ్యాంకులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభు త్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తమకు సొంత ఇళ్లు వస్తుందనే ఆశతో అప్పులు చేసి రూ.25వేల నుంచి లక్షల వరకు డిపాజిట్లు కట్టిన లబ్ధిదారులు ఇంత వరకు ఇళ్లు కేటాయించకపోవడంతో నిరాశ చెందుతు న్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని సూచించారు. ప్రజల పన్నులతో వచ్చిన ఆదాయం ఆధారంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపడుతోందని, అది ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం కేటాయించాలంటూ సీపీఐ ఉద్యమా నికి సన్నద్ధమవుతుంటే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి లబ్ధిదారులను మభ్యపెట్టేలా మాట్లాడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. టీడీపీ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ పేదల జీవన విధానంలో మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అప్పజెప్పకుండా, రాజకీయ కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్‌ తుంగలో తొక్కారని, ఈ ప్రభుత్వ వైఖరిపై ఐక్యంగా పోరాడాలని కోరారు. విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లా డుతూ ఇచ్చిన హామీల అమలులో జగన్‌ మాట తప్పారని, క్రమేపీ ప్రభుత్వ పనితీరు తిరోగమనంలో ఉందని విమర్శిం చారు. ఎంసీపీఐ(యు) నాయకులు ఖాదర్‌భాషా, ఎస్‌యూ సీఐసీ నాయకులు సుధీర్‌ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల కేటాయింపు జాప్యంతో లబ్ధిదారులు అద్దెలు చెల్లించలేక ఆర్థికంగా చితికిపోతున్నారన్నారు. సభకు అధ్యక్షత వహిం చిన దోనేపూడి శంకర్‌ మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల లబ్ది దారులకు న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోరాడు తోందని చెప్పారు. లబ్దిదారుల దగ్గరున్న పట్టాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని, వారికి అండగా సీపీఐ నిలు స్తుందన్నారు. సీపీఎం కార్పొరేట్‌ సత్తిబాబు మాట్లాడుతూ గత భూపోరాటాల స్ఫూర్తితో టిడ్కో ఇళ్ల సాధన కోసం కలసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో ఐక్యంగా ఉద్యమిద్దామని చెప్పారు. టిఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు మాట్లాడుతూ టిడ్కో ఇళ్ల సాధన కోసం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటాలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, ఇన్ఫాఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సయ్యద్‌ అఫ్సర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, ఏఐటీయూసీ నాయకులు తాతయ్య, సీపీఐ నూజివీడు పట్టణ కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించకుండా జాప్యం చేస్తోందన్నారు. సీపీఐ చేపట్టబోయే ఉద్యమాలకు సంపూర్ణ మద్దతిస్తామమని చెప్పారు. తొలుత వివిధ ప్రాంతాలకు చెందిన టిడ్కో బాధిత లబ్ధిదారులు తమ సమస్యల్ని వివరించారు. ఈ సమావేశంలో టిడ్కో గృహ సముదాయాలకు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు కల్పించి లబ్బిదారులకు సత్వరమే వాటిని స్వాధీనం చేయాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకుగాను సెప్టెంబరు మొదటి వారంలో 110 పట్టణాలలో సదస్సులు, 20న చలో మున్సిపల్‌ ఆఫీస్‌ పిలుపు తీర్మానాలను సీపీఐ కృష్ణాజిల్లా కార్యదర్శి అక్కినేని వనజ ప్రవేశపెట్టగా ఆమోదించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యుడు రావుల వెంకయ్య, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, మహిళా సమాఖ్య నాయకులు దుర్గాంబ, భారతి, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, టిడ్కో లబ్ధిదారులు పాల్గొన్నారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్రానాయక్‌, ఆర్‌.పిచ్చయ్య అభ్యుదయ గీతాలను ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img