Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టిడ్కో, జగనన్న కాలనీ లబ్ధిదారుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరు ఆగదు

. టిడ్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులకు స్వాధీనం చేయాలి
. జగనన్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలి
. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలివ్వాలి
. జగన్‌ పేదలకిచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
. ఐదో రోజు పోరుబాటలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో, జగనన్న కాలనీ లబ్ధిదారుల సమస్యలు పరిష్కారమయ్యేవరకు తమ పోరాటం ఆగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీపీఐ పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా రూరల్‌ మండలం పోణంగిలో టిడ్కో గృహాలను సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టిడ్కో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. లబ్ధిదారులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు సీపీఐ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ఈ ఇళ్లలో పేదలు ఎలా ఉంటారని ఎగతాళి చేసిన జగన్‌, కట్టిన ఇళ్లను కూడా గత మూడున్నరేళ్లుగా లబ్ధిదారులకు స్వాధీనం చేయకుండా ఇబ్బందిపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చెప్పే విషయాలకు, ఆచరణకు ఏ మాత్రం పొంతన లేదన్నారు.
కేవలం గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లు అయినందున, లబ్ధిదారులకు వాటిని స్వాధీనం చేస్తే ఆ ఘనత టీడీపీకి దక్కుతుందన్న అక్కసుతో ప్రజల జీవితాలతో జగన్‌ ఆడుకుంటున్నారని రామకృష్ణ మండిపడ్డారు. టిడ్కో ఇళ్లను వైసీపీ కార్యకర్తలకు ఇవ్వడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇకనైనా ఆ ప్రయత్నాలు మానుకుని మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు వాటిని స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వారిపక్షాన సీపీఐ పోరాడుతుందని హెచ్చరించారు. ఇక జగనన్న కాలనీల పరిస్థితి రాష్ట్రంలో మరింత అధ్వానంగా ఉందని విమర్శించారు. జగనన్న కాలనీలలో తాగునీరు, అంతర్గత రహదారులు, విద్యుత్‌ వంటి కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులపై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. ఎన్నికల సందర్భంగా పేదవారికి సొంత ఇంటి కల సాకారం చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నంగా ఒక సెంటు స్థలం ఊరికి దూరంగా ఇచ్చి ఇల్లు కట్టినట్లు గొప్పగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. పట్టణంలో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు స్థలం కేటాయించి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఉచితంగా కేటాయించాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో, జగనన్న కాలనీల్లో లబ్ధిదారులతో ఈ నెల 31వ తేదీ వరకు సంతకాల సేకరణ చేసి ఫిబ్రవరి 6న జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రాలు అందజేస్తామని, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా ఫిబ్రవరి 22న విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జి అక్కినేని వనజ మాట్లాడుతూ జగనన్న కాలనీలలో ప్రభుత్వమే ఉచితంగా ఇళ్లు నిర్మించి, టిడ్కో ఇళ్లను మౌలిక సదుపాయాలతో లబ్ధిదారులకు తక్షణం స్వాధీనం చేయాలని డిమాండ్‌ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ సీపీఐ పోరాట ఫలితం కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేయడానికి ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి పొటేలు పెంటయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పుప్పాల కన్నబాబు, కొండేటి బేబి తదితరులు పాల్గొన్నారు.
పొన్నూరు :
జగనన్న గృహాలకు రూ.5 లక్షలు ఇచ్చి, టిడ్కో ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. నియోజకవర్గ కేంద్రమైన పొన్నూరులోని టిడ్కో ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ పేదలకు పంపిణీ చేసిన స్థలాలలో జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇవ్వాలని, గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టి 90 శాతం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను మిగతా 10 శాతం పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్నారు. జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలని, టిడ్కో ఇళ్లను వెంటనే అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేయాలన్న డిమాండ్లతో కరపత్రాలు పంపిణీ చేసి లబ్ధిదారులందరితో సంతకాలు చేయించి పట్టణ కమిషనర్లకు, మండల తహశీల్థార్‌లకు అర్జీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఆరేటి రామారావు తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో
జగనన్న ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణ సమీపంలో దొరపల్లె దగ్గర సీపీఐ అధ్వర్యంలో జగనన్న కాలనీని సందర్శించి లబ్ధిదారులతో సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులుతో పాటు జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, డోన్‌ మున్సిపాలిటీ 16 వార్డు కౌన్సిలర్‌ పి.సుంకయ్య, డోన్‌ మండల కార్యదర్శి పులి శేఖర్‌, డోన్‌ పట్టణ కార్యదర్శి నారాయణ, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు కె.ప్రభాకర్‌, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి అబ్బాస్‌, మహిళా సమాఖ్య నాయకురాలు లక్ష్మీ దేవమ్మ, ఏఐవైఫ్‌ నాయకులు రణత్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలోని జగనన్న కాలనీలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు బృందం లబ్ధిదారుల సమస్యలపై సంతకాలు సేకరించింది. ఈ కార్యక్రమంలో భీమారావుతోపాటు సీపీఐ ఉండి మండల కార్యదర్శి కలిశెట్టి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తణుకు పైడిపర్రు రోడ్డులోని జగనన్న లేఔట్‌లోని గృహ నిర్మాణాలను, మౌలిక వసతులను సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, కోశాధికారి గుబ్బల వెంకటేశ్వరరావు, బొద్దాని మురళీ, బండి సత్యనారాయణ తదితరులు పరిశీలించారు. రావిపాడు గ్రామంలో బెండ్ల పాలెం జగనన్న కాలనీలో బోడ బల్ల లక్ష్మీనారాయణ, బోయడి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని కొత్తపేట, రాజపేట ప్రాంతాల్లో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి.కొండలరావు, రమణమ్మ. ఎడ్ల లక్ష్మి, నల్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img