Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీఏ, డీఏల కోసమా సలహాదారులు?

. ప్రమాదకరంగా మారిన నియామకాల వ్యవహారం
. రాజకీయాలు కోర్టు బయటే చూసుకోండి
. ప్రభుత్వ విధానంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

విశాలాంధ్రబ్యూరో`అమరావతి : రాష్ట్రంలో రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కేంద్రంగా మార్చిన సలహాదారుల నియామకాల వ్యవహారంపై హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. దేవాదాయశాఖ సలహాదారు శ్రీకాంత్‌, ఉద్యోగుల సలహాదారు చంద్రశేఖర్‌ నియామకాలపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను కలిపి హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా ప్రభుత్వ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం సుబ్రహ్మణ్యం నిష్ణాతులైన వారినే రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా నియమిస్తుందని కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోబోయే ముందు సలహాదారుల అభిప్రాయం తీసుకుంటుందని కోర్టుకు తెలిపారు. కాబట్టి వారి నియామకం విషయంలో మెరిట్స్‌పై వాదనలు వినిపిస్తామని హైకోర్టుకు వెల్లడిరచారు. ఈ సందర్భంగా సలహాదారుల నియామకంపై జరుగుతున్న రచ్చపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ఉద్యోగుల టీఏ, డీఏ కోసం మరో సలహాదారుడిని నియమిస్తారా? అని ప్రశ్నించింది. ఈ సలహాదారుల నియామకం ప్రమాదకరమైన వ్యవహారమని పేర్కొంది ఏవైనా రాజకీయాలుంటే బయటే చూసుకోవాలని, కోర్టు వరకూ తీసుకురావద్దని సూచించింది. రాజకీయాలు తీసుకొస్తే ఎలా హ్యాండిల్‌ చేయాలో మాకు తెలుసని హెచ్చరించింది.
నాలుగు వారాల్లో ఫైనాన్స్‌ కమిషన్‌ నియమించండి
వైసీపీ ప్రభుత్వం ఇంతవరకు 5వ ఫైనాన్స్‌ కమిషన్‌ను నియమించలేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ సందర్భంగా మూడు నెలల్లో ఫైనాన్స్‌ కమిషన్‌ను నియమిస్తామని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. అయితే మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఫైనాన్స్‌ కమిషన్‌ను నియమించలేదని జీవీ రెడ్డి తరపున న్యాయవాది ఉమేష్‌ చంద్ర హైకోర్టులో వాదనలు వినిపించారు. దీని వల్ల నిధులు దారిమళ్లుతున్నాయని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఫైనాన్స్‌ కమిషన్‌ను ఎందుకు నియమించలేదని ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సమాధానంగా తాము ఫైనాన్స్‌ కమిషన్‌ను నియమించి ఆ ఫైల్‌ను గవర్నర్‌ వద్దకు పంపామని, అక్కడి నుంచి వచ్చిన వెంటనే ఫైనాన్స్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని న్యాయమూర్తికి చెప్పారు. రెండు వారాల్లో ఈ నియామక ప్రక్రియ పూర్తి అవుతుందని వివరించారు. దీంతో నాలుగు వారాల సమయం ఇస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి పేర్కొంటూ తదుపరి విచారణ ఫిబ్రవరికి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img