Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీకా సంబరాలు..ఎందుకో ? : సిద్దరామయ్య

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌లో గొప్ప మైలురాయిని దాటినందుకు బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలెందుకు ఈ సంబరాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య ప్రశ్నించారు. జనాభాలో కేవలం 21 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ చేసినందుకా? అని నిలదీశారు. భారత దేశ జనాభాలో కేవలం 21 శాతం మందికి (29 కోట్ల మందికి) మాత్రమే వ్యాక్సిన్‌ డోసులు రెండూ అందాయనే విషయాన్ని బీజేపీ నేతలు గుర్తించడం లేదన్నారు. అయితే కరోనా ప్రభావం ఇంకా తీవ్రంగా ఉందన్నారు. దేశంలోని 139 కోట్ల మందిలో కేవలం 29 కోట్ల మందికి మాత్రమే పూర్తిగా టీకాకరణ జరిగిందన్నారు. అంటే జనాభాలో 21 శాతం మంది మాత్రమే సంపూర్ణంగా వ్యాక్సినేషన్‌ పొందారని తెలిపారు. అమెరికా జనాభాలో 56 శాతం మంది, చైనా జనాభాలో 70 శాతం మంది, కెనడా జనాభాలో 71 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్లను పొందారని చెప్పారు. భారత దేశ జనాభాలో కేవలం 21 శాతం మందికి మాత్రమే సంపూర్ణ వ్యాక్సినేషన్‌ జరిగిందన్నారు. సంబరాలు చేసుకోవడానికి ముందు ఉన్నత ప్రమాణాలను పాటించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.

సెకండ్‌ డోస్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలి : పవన్‌ ఖేరా
కాగా కరోనా టీకా డోసుల పంపిణీ వంద కోట్ల మైలురాయికి చేరడం తమ ప్రభుత్వ ఘనతగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రసంగం సర్కార్‌ వైఫల్యంతో కరోనా మహమ్మారి బారినపడి తాము ప్రేమించే వారిని కోల్పోయిన ఎందరినో అవమానించేలా ఉందని కరోనా సెకండ్‌ వేవ్‌ను ఉద్దేశించి కాంగ్రెస్‌ ప్రతినిధి పవన్‌ ఖేరా వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్‌ గురించి గొప్పలు చెబుతున్న ప్రధాని మోదీ భారత్‌లో వ్యాక్సిన్‌ సెకండ్‌ డోస్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ఆయన నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img