Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ

ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులిచ్చిన అధికారులు
పార్టీ పత్రికలో వార్తలు, ఎడిటర్‌ గురించి ఆరా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంగళవారం టీడీపీ కార్యాలయానికి వచ్చిన సీఐడీ అధికారులు టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు ఇచ్చి వెళ్లారు. పార్టీ అనుబంధ పత్రిక చైతన్య రథంలో వస్తున్న వార్తా కథనాలపై సీఐడీ వివరాలు సేకరించింది. ఇంతకూ చైతన్యరథం పత్రిక ఎడిటర్‌ ఎవరు? నిర్వహణ ఎవరు చూస్తున్నారు? అంటూ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రశ్నలు వేశారు. అనంతరం కార్యాలయంలో ఉన్న పార్టీ న్యాయవాది చేతికి నోటీసులు అందజేసి సీఐడీ అధికారులు వెళ్లిపోయారు. చైతన్య రథం పేరుతో టీడీపీ డిజిటల్‌ మ్యాగజైన్‌ను నడుపుతోంది. రోజూ దాదాపు 24 పేజీలతో వచ్చే ఈ మ్యాగజైన్‌ ద్వారా టీడీపీకి సంబంధించిన వార్తా విశేషాలను సభ్యులకు చేరవేస్తారు. అలాగే అధికారపక్షం చేస్తున్న అక్రమ వ్యవహారాలపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు మ్యాగజైన్‌లో కథనాలు ప్రచురిస్తున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గురించి ‘అపరిచితుడు’ అనే శీర్షికన, ‘‘బుగ్గన భూదాహం’’ అనే ఉపశీర్షికతో కథనం ప్రచురితమయ్యింది. ఇందులో బుగ్గన ఆస్తుల గురించి ప్రచురించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిటర్నింగ్‌ అధికారికి ఇచ్చిన అఫిడవిట్‌ను తీసుకుని ఆస్తులపై కథనం ప్రచురించారంటూ చైతన్య రథంపై కేసు నమోదు చేశారు. మంత్రి బుగ్గనకు అప్రతిష్ఠ కలిగించే విధంగా, గౌరవ మర్యాదలకు భంగం కలిగించారంటూ సెక్షన్లు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న సీఐడీ అధికారులు సీఆర్పీసీలోని సెక్షన్‌ 91 కింద నోటీసులు ఇచ్చారు. చైతన్య రథం పత్రిక ఎడిటర్‌ ఎవరు.. నిర్వహణ ఎవరు చూస్తున్నారు అని.. అలాగే అపరిచుతుడు అనే పేరుతో ఈ కథనాన్ని రాసిన రిపోర్డర్‌ ఎవరు అని, చైతన్య రథం డిజిటల్‌ మ్యాగజైన్‌కు సంబంధించి ఒరిజనల్‌ కాపీ అందజేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మూడు నెలల క్రితమే శీర్షికపై కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పుడు నేరుగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి నోటీసులు అందజేయడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img