Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

టీడీపీ నిరసనపై ఉక్కుపాదం

. పోలీస్‌ వలయంలో విశాఖ
. ఎక్కడికక్కడ అరెస్టులు
. అర్ధరాత్రి నుంచే గృహ నిర్బంధం
. రిషికొండ దారులు మూసివేత

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : విశాఖ నగరంలో టీడీపీ తలపెట్టిన ‘అనకొండ నోటిలో రిషికొండ’ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గురువారం అర్ధరాత్రి నుంచే టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేసి అరెస్టులకు పూనుకున్నారు. రిషికొండలో అక్రమ తవ్వకాలు, కట్టడాలపై నిరసన తెలుపుతూ టీడీపీ శ్రేణులు ‘చలో రిషికొండ’ పిలుపునివ్వడంతో విశాఖ నగరంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. దసపల్లా భూములతోపాటు పేదల ఇళ్లకు కేటాయించిన స్థలాల కబ్జాపై ఆరుచోట్ల ఆందోళనకు టీడీపీ పిలుపునిచ్చింది. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు కొంతమంది కార్పొరేటర్లను గృహనిర్బంధం చేశారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ఇళ్ల వద్ద పోలీసులు పెద్దఎత్తున మోహరించారు. టీడీపీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. కార్యాలయానికి వెళ్తున్న టీడీపీ నేతలు పోతన రెడ్డి, బొట్టా వెంకటరమణను అరెస్ట్‌ చేసి 3వ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి పార్టీ కార్యాలయానికి వెళ్తున్నామని చెప్పినా పోలీసులు బలవంతంగా జీపు ఎక్కించి అరెస్టులకు పూనుకున్నారు. పోలీసుల తీరుపై అనిత తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌కు విపక్షాలను కట్టడి చేయడంలో ఉన్న శ్రద్ధ రిషికొండను పరిరక్షించడంలో ఉంటే పర్యావరణానికి ముప్పు వచ్చేది కాదని ఆమె విమర్శించారు. కైలాసగిరి కల్యాణమండపంలో 36 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని రోజంతా నిర్బంధించారు. మరోపక్క పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్‌కు టీడీపీ శ్రేణుల్ని తరలించి రోజంతా బయటకు రాకుండా నిరోధించారు. అరెస్ట్‌ అయిన వారిలో మాడుగుల టీడీపీ ఇన్చార్జి పీవీజీ కుమార్‌, పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చిరంజీవి, నేతలు పాసర్ల ప్రసాద్‌, ఆళ్ల శ్రీనివాసరావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ గోపాల్‌, రాష్ట్ర కార్యదర్శి ఆరేటి మహేశ్‌, నేతలు, కార్యకర్తలు ఉన్నారు. మరోపక్క రుషికొండ వైపునకు వెళ్లే రహదారులన్నీ పూర్తిగా మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. సాగర్‌ నగర్‌, భీమిలి వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆటోలు, బస్సులు అటువైపు వెళ్లకపోవడంతో అనేకమంది లగేజీ బ్యాగులతో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. విశాఖకు వచ్చిన పర్యాటకులకు సైతం ఇబ్బందులు తప్పలేదు. రుషికొండ బీచ్‌ని పూర్తిగా మూసివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img