Friday, April 19, 2024
Friday, April 19, 2024

డిజిటల్‌ కరెన్సీపై ఆర్‌బీఐతో చర్చిస్తున్నాం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
న్యూదిల్లీ : సెంట్రల్‌ బ్యాంక్‌-ఆధారిత డిజిటల్‌ కరెన్సీకి సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ)తో చర్చలు జరుగుతున్నాయని, తగిన చర్చల తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 1న తన బడ్జెట్‌ ప్రసంగంలో సీతారామన్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో డిజిటల్‌ రూపాయి లేదా సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ(సీబీడీసీ) ని ఆర్‌బీఐ జారీ చేస్తుందని ప్రకటించారు. ఏప్రిల్‌ 1 నుండి ఇతర ప్రైవేట్‌ డిజిటల్‌ ఆస్తుల నుండి వచ్చే లాభాలపై ప్రభుత్వం 30 శాతం పన్ను విధించనున్నట్లు ఆమె ప్రకటించారు. సోమవారం ఇక్కడ ఆర్‌బీఐకి చెందిన కేంద్ర డైరెక్టర్ల బోర్డును ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత ఆమె ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, డిజిటల్‌ కరెన్సీలకు సంబంధించి కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం బోర్డులో ఉన్నాయని చెప్పారు. బడ్జెట్‌ ప్రకటనకు ముందే సీబీసీడీకి సంబంధించి ఆర్‌బీఐతో చర్చలు జరుగుతున్నాయని, అవి కొనసాగుతున్నాయని ఆమె చెప్పారు. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మాట్లాడుతూ అనేక ఇతర సమస్యల మాదిరిగానే, ఈ ప్రత్యేక సమస్య కూడా ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య అంతర్గతంగా చర్చలో ఉందని అన్నారు. ‘మాకు ఏవైనా అంశాలు ఉంటే మేము ప్రభుత్వంతో చర్చిస్తాం’ అని తెలిపారు. సీబీడీసీ అనేది ఒక డిజిటల్‌ లేదా వర్చువల్‌ కరెన్సీ. అయితే ఇది గత దశాబ్దంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్‌ వర్చువల్‌ కరెన్సీలు లేదా క్రిప్టో కరెన్సీతో పోల్చదగినది కాదు. ప్రైవేట్‌ వర్చువల్‌ కరెన్సీలు జారీ చేసేవారు లేనందున ఏ వ్యక్తి రుణం లేదా బాధ్యతలను సూచించవు. అవి డబ్బు కాదు. కచ్చితంగా కరెన్సీ కాదు. గతవారం దాస్‌ మాట్లాడుతూ ఈ విషయంలో కేంద్ర బ్యాంకు తొందరపడకూడదని, సీబీడీసీని ప్రవేశపెట్టడానికి ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తోందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img