Friday, April 19, 2024
Friday, April 19, 2024

డిసెంబరుకల్లా భూసర్వే

. దేశంలోనే ఇంత పెద్ద సర్వే ఎక్కడా చేపట్టలేదు
. ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలి
. సీఎం జగన్‌ ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జగనన్న శాశ్వత భూ హక్కు…భూ రక్ష పథకం కింద చేపడుతున్న భూ సర్వేను ఈ ఏడాది డిసెంబరు చివరినాటికి ఎట్టిపరిస్థితుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, గనులశాఖలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతపెద్ద స్థాయిలో సర్వే చేపట్టడంలేదన్నారు. ప్రజలకు అత్యంత ఉపయోగకర కార్యక్రమమని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరూ టాంపర్‌ చేయలేని విధంగా పత్రాలు అందిస్తున్నామని, ఇది ఇప్పటివారికే కాకుండా భవిష్యత్‌ తరాలవారికీ కూడా ఎంతో ఉపయోగమని సీఎం తెలిపారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు సర్వే ప్రక్రియను పూర్తిచేసేదిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, జాప్యానికి తావులేకుండా కావాల్సిన సాంకేతిక పరికరాలను తెప్పించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూశాఖ పరిధిలో తొలి దశలో చేపట్టిన 2వేల గ్రామాల్లో సర్వే ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చాలావరకు పత్రాల పంపిణీ జరుగుతోందని అధికారులు వివరించగా, మే 20 నాటికి సర్వే రాళ్లు వేసే పనితోపాటు అన్ని రకాలుగా సర్వే ప్రక్రియ పూర్తిచేయాలని సీఎం సూచించారు. అవసరమైనంతమేర రోవర్లను ఆర్డర్‌ చేయాలని, దీనివల్ల అనుకున్న సమయానికే సర్వే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. అలాగే ప్రతి గ్రామ సచివాలయంలో సర్వేకోసం పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వాటిల్లో కూడా రోవర్‌ తరహా పరికరాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. దీనివల్ల సర్వేయర్‌ పూర్తిస్థాయిలో తన పనిని పూర్తిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. సర్వే పూర్తైన తర్వాత సరిహద్దుల వద్ద వేసేందుకు 31 లక్షల సర్వే రాళ్లను సిద్ధంచేశామని, వీటిలో రోజుకు 50వేల సర్వే రాళ్ల చొప్పున సరఫరా చేసేందుకు ప్రణాళిక వేసుకున్నామని అధికారులు వివరించారు.
మున్సిపల్‌ ప్రాంతాల్లో చేయాల్సిన సర్వేకోసం కూడా సన్నాహాలు చేసుకుంటున్నామని, దీనికి సంబంధించి డేటా క్రోడీకరణ జరుగుతుందని మున్సిపల్‌ అధికారులు తెలియజేశారు.
ఏప్రిల్‌ మూడో వారం నాటికి 300 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తవుతుందని పంచాయతీరాజ్‌ అధికారులు వివరించారు. నిర్దేశించుకున్న టైం లైన్స్‌ ప్రకారం కచ్చితంగా సర్వే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
ఈసమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, స్పెషల్‌ సీఎస్‌లు జి.సాయి ప్రసాద్‌, వై.శ్రీలక్ష్మి, రజిత్‌ భార్గవ్‌, బుడితి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img