Friday, April 19, 2024
Friday, April 19, 2024

తుది తీర్పునకు లోబడే ఇళ్ల పట్టాల పంపిణీ

ఆర్‌-5 జోన్‌పై రైతుల పిటిషన్‌ తిరస్కరించిన హైకోర్టు
రాజధాని ప్రజలందరిదీ అంటూ వ్యాఖ్య

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : ఆర్‌5 జోన్‌పై రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిగింది. ఆర్‌-5జోన్‌ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలంటూ రాజధాని రైతులు మధ్యంతర ఉత్తర్వులు కోరారు. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది. మరోపక్క ఇళ్లస్థలాల పంపిణీకి ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పిటిషన్‌ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఏ ఒక్కరికో… ఒక వర్గానికి పరిమితం కాదు. రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా? రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. ఫలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం సరైనది కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే… భూములు ఇచ్చిన వారివి కావంటూ సీజే వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై కొన్ని అంశాలు హైకోర్టులో… కొన్ని అంశాలు సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వ విధుల్లో భాగమేనంటూ, ఇళ్ల పట్టాల పంపిణీ కోర్టు తుది తీర్పునకు లోబడి ఉండాలని హైకోర్టు వెల్లడిరచింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం అభివృద్ధి చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను ఆర్‌`5జోన్‌గా మార్పు చేసి, ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాల కోసం 1,134 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిని అభివృద్ధి చేయకుండా, చివరకు జరుగుతున్న పనులను కూడా నిలిపివేసి, రైతులకు గత నాలుగు సంవత్సరాలుగా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వకుండా, ఇతర ప్రాంతాల్లోని పేదలకు రాజధాని కోసం ఇచ్చిన భూములను పందారం చేస్తున్నారని రైతులు అభ్యంతరం తెలిపారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ను చెడగొట్టడం కోసమే ప్రభుత్వం పేదలకు సెంటు స్థలం పేరుతో కుట్రకు తెరతీసిందని వారు ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం భూములన్నీ సీఆర్‌డీఏ పరిధిలో ఉన్నందున వాటిపై సర్వాధికారాలు ప్రభుత్వానికే ఉంటాయని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి ఊరట కలిగించింది. హైకోర్టు తీర్పును అంగీకరించని రైతులు శనివారం సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img