Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

తెలంగాణ వాకౌట్‌

ఏపీ వాదనలను సమర్థించిన కేఆర్‌ఎంబీ చైర్మన్‌
సాగర్‌, శ్రీశైలం జలాలను సాగు, తాగునీటికి మాత్రమే వాడాలని స్పష్టీకరణ

హైదరాబాద్‌: కృష్ణా నదీ యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశం నుంచి తెలంగాణ వాకౌట్‌ చేసింది. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం కొనసాగింది. సాగర్‌, కృష్ణా డెల్టా కింద సాగు, తాగు నీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఎంపీ సింగ్‌ స్పష్టం చేశారు. జలవిద్యుత్‌ ఉత్పత్తిపై కేఆర్‌ఎంబీ చైర్మన్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేసి బయటకు వచ్చారు. కృష్ణా జలవివాదాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం బుధవారం సింగ్‌ అధ్యక్షతన హైదరాబాద్‌ జలసౌధలో జరిగింది. బోర్డు ప్రతినిధులతో పాటు, రెండు రాష్ట్రాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణకు జలవిద్యుత్‌ ఉత్పత్తి చాలా అవసరమని అధికారులు వివరించారు.
భౌగోళిక స్వరూపం దృష్ట్యా ఎత్తిపోతల పథకాల ద్వారా తాగు, సాగునీరు ఇవ్వాల్సిఉందని, వ్యవసాయ బోరుబావులకు కూడా విద్యుదుత్పత్తి కావాలని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిన ప్రాజెక్టు అన్న తెలంగాణ అధికారులు జలవిద్యుదుత్పత్తి అత్యవసరమని స్పష్టం చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌ అధికారులు అభ్యంతరం తెలిపారు. దిగువన సాగునీటి అవసరాలు లేనప్పుడు విద్యుదుత్పత్తి చేస్తే తమకు నష్టం జరుగుతుందని వివరించారు. ఈ వాదనలను కేఆర్‌ఎంబీ చైర్మన్‌ సమర్థిస్తూ, నాగార్జున సాగర్‌, కృష్ణాడెల్టాలో సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే జలవిద్యుత్‌ ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ అధికారులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. తెలంగాణ వాకౌట్‌ అనంతరం కృష్ణాబోర్డు సమావేశం ముగిసింది.
ఆ తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ ఛైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలో జరుగుతున్న ఉమ్మడి భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్‌ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్‌ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్‌ కుమార్‌ హాజరై వారివారి వాదనలను బలంగా వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img