Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

త్రిపురలో బీజేపీ తాలిబన్‌ రాజ్‌

. వామపక్ష, కాంగ్రెస్‌ ఎంపీల బృందం విమర్శ
. ప్రతినిధి బృందంపై కాషాయ మూకల దాడి ` ముగ్గురి అరెస్ట్‌

అగర్తల: త్రిపురలో బీజేపీ ‘తాలిబన్‌ రాజ్‌’ సాగుతోందని వామపక్ష`కాంగ్రెస్‌ పార్లమెంటరీ ప్రతినిధుల బృందం విమర్శించింది. అధికార దుర్వినియోగం, ధనబలాన్ని ప్రయోగించినప్పటికీ బీజేపీ స్వల్ప మెజారిటీతో అధికారంలోకి రాగలిగిందని, అది జీర్ణించుకోలేక రాజకీయ ప్రత్యర్థులపై, కార్మిక, కర్షక సంఘాల కార్యకర్తలపై ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే హింసాత్మక దాడులు ప్రారంభించిందని విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హింసకు పాల్పడిరది. ఆయా ఘటనలపై విచారణ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లిన వామపక్ష, కాంగ్రెస్‌ పార్లమెంటరీ ప్రతినిధి బృందంపై శుక్రవారం బీజేపీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. దీంతో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. హింసాత్మక ఘటనలు జరిగిన పశ్చిమ త్రిపురలోని సెపాహిజాల, గోమతి జిల్లాల్లో పర్యటించి బాధిత కుటుంబాలతో మాట్లాడేందుకు ఎంపీలు ప్రయత్నించిన సమయంలో దాడి జరిగిందన్నారు. సెపాహిజాల జిల్లాలోని బిషాల్‌గఢ్‌ సబ్‌డివిజన్‌లోని సరిహద్దు గ్రామమైన నేహల్‌చంద్ర నగర్‌లో ఎంపీలపై దాడి జరిగింది. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసి, ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసు సీనియర్‌ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించినట్లు చెప్పారు. ఎంపీల వాహనాలపై దుండగులు రాళ్లు రువ్వారని, దీంతో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. నాయకులు ఎస్కార్ట్‌ పోలీసుల సాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారని, వారిలో ఎవరికీ గాయాలు కాలేదని, వాహనాలు మాత్రమే ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. అటు మోహన్‌పూర్‌ను సందర్శించిన పార్లమెంటరీ సభ్యులపైనా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు.
చట్టసభల్లో త్రిపురపై గళమెత్తుతాం: మాపై దాడి ఆక్షేపణీయం
బీజేపీ పాలిత త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింస, దానిపై విచారణకు వెళ్లి బాధితులను కలిసే ప్రయత్నం చేసిన తమపై కషాయ మూకలు దాడులు చేయడాన్ని వామపక్ష, కాంగ్రెస్‌ ప్రతినిధుల బృంద సభ్యులు తీవ్రంగా ఖండిరచారు. త్రిపురలో హింసపై పార్లమెంటులో గళమెత్తుతామని తేల్చిచెప్పారు. విలేకరుల సమావేశంలో సీపీఐ ఎంపీ ఇల్మారం కరీం మాట్లాడుతూ ‘బీజేపీఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలు కేవలం రాష్ట్ర ప్రజలపై దాడులు చేయడమే కాకుండా వారి జీవనోపాధినీ నాశనం చేశారు. ఫలితంగా అనేకమంది ఇల్లువాకిళ్లు వదిలి వలసబాట పట్టారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులను గవర్నర్‌ సత్యదేవ్‌ నరేన్‌ ఆర్య దృష్టికి నిజనిర్థారణ ప్రతినిధి బృందం తీసుకెళ్లింది. దీనిని పరిశీలిస్తానని, తగు చర్యలు తీసుకుంటానని గవర్నర్‌ హామీనిచ్చారు’ అని అన్నారు. పార్లమెంటు ఉభయ సభల్లో త్రిపురలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై గళమెత్తుతామని చెప్పారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ త్రిపురలో బీజేపీ ‘తాలిబన్‌ రాజ్‌’ సాగుతోందని విమర్శించారు. త్రిపురలో ఎంపీల బృందంపై దాడి జరిగితే ప్రధానిగానీ హోంమంత్రిగానీ నోరు విప్పలేదని, ఇది పార్లమెంటుకు అవమానమని ఆయన నొక్కిచెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి మాట్లాడుతూ వెయ్యికిపైగా హింసాత్మక ఘటనలు ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జరిగాయని అన్నారు. కాంగ్రెస్‌ త్రిపుర అధ్యక్షుడు బిరజిత్‌ సిన్హా మాట్లాడుతూ, మూకలను అదుపు చేయకుంటే రాష్ట్రంలో పౌర యుద్ధం తరహా పరిస్థితి నెలకొనవచ్చన్నారు. సమావేశంలో సీపీఎం ఎంపీ వికాశ్‌ రంజన్‌ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ ఖండన: వామపక్ష, కాంగ్రెస్‌ పార్లమెంటరీ ప్రతినిధుల బృందంపై దాడిని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విట్టర్‌ మాధ్యమంగా ఖండిరచారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ పురిగొల్పిన హింస విజయం సాధించిందని, దీనిపై అక్కడ విజయోత్సవ ర్యాలీని బీజేపీ నిర్వహిస్తుందని ఆయన దుయ్యబట్టారు.
ఇదంతా కుట్ర: బీజేపీ
వామపక్ష, కాంగ్రెస్‌ పార్లమెంటరీ ప్రతినిధుల బృందంపై దాడి వెనుక పెద్ద కుట్రే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి నబేందు భట్టాచార్య ఆరోపించారు. బీజేపీని జాతీయ స్థాయిలో అవమాననించేందుకు లెఫ్ట్‌, కాంగ్రెస్‌ యత్నిస్తోందని అన్నారు. దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి మాణిక్‌ సాహా… డీజీపీతో మాట్లాడారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. పార్టీ సీనియర్లు స్థానిక యంత్రాంగాలతో దీనిపై చర్చించారు’ అని భట్టాచార్య అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img