Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

థర్డ్‌ ఫ్రంట్‌తో బీజేపీకే లాభం

. సమర్థ పాలన కాంగ్రెస్‌తోనే…: ఖడ్గే
. భారత్‌ జోడో యాత్ర పార్టీకి టర్నింగ్‌ పాయింట్‌ : సోనియా

న్యూదిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆశిస్తున్నట్లుగా థర్డ్‌ ఫ్రంట్‌ ఉనికిలోకి వస్తే బీజేపీకి లాభం జరుగుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే నొక్కిచెప్పారు. తృణమూల్‌ కాంగ్రెస్‌, భారత్‌ రాష్ట్ర సమితి వంటి ప్రాంతీయ పార్టీలు థర్డ్‌ ఫ్రంట్‌ను కోరుకుంటున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు ఇప్పటికే ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌, మమతా బెనర్జీ వంటి కీలక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు పావులు కదిపారు. కాంగ్రెస్‌ లేని ప్రత్యామ్నాయ కూటమి సాధ్యం కాదని పవార్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ 85వ ప్లీనరీలో శనివారం థర్డ్‌ ఫ్రంట్‌ వద్దని ఖడ్గే హితవు పలికారు. తద్వార బీజేపీకి ప్రయోజనం ఉంటుందని చెప్పారు. దేశానికి సమర్థ, నిర్ణయాత్మక పరిపాలనను అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని ఖడ్గే పునరుద్ఘాటించారు. అన్ని విపక్షాలు ఐక్యంగా బీజేపీని మట్టికరిపించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం తక్షణావశ్యమని, 2024 ఎన్నికల్లో నిరంకుశ, ప్రజా వ్యతిరేక బీజేపీని ఓడిరచాలంటే సైద్ధాంతిక సారూప్యతతో పాటు ఐక్య కార్యాచరణ అవసరమన్నారు. కలిసి వచ్చే భావసారూప్యతగల పార్టీలతో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష ఐక్యత తక్షణావశ్యమన్నారు. భారత్‌ జోడో యాత్ర… ప్రజా ఉద్యమమని, తద్వార సేకరించిన వివరాల ఆధారంగా తమ విజన్‌2024ను ఖారారు చేయనున్నట్లు ఖడ్గే వెల్లడిరచారు. కోట్లాది ఉద్యోగాలను ఎంఎస్‌ఎంఈల ద్వారా సృష్టించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి నిత్యావసరాల ధరలు తగ్గించడం, ధనికులు, పేదల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించడం, రైతులకు వారి ఉత్పత్తులకు న్యాయమైన ధర లభించేలా చేయడం వంటి లక్ష్యాలు కాంగ్రెస్‌కు ఉన్నాయని ఖడ్గే తెలిపారు. విద్వేష వాతావరణాన్ని సామరస్యపూర్వకమైనదిగా మార్చేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ధనబలంకండబలం కట్టడి, ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ వంటి సంస్థల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్‌ ధ్యేయమన్నారు. ఇదే తమ పార్టీ విజన్‌ అని ఖడ్గే వెల్లడిరచారు. అంతకుముందు కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ భారత్‌ జోడో యాత్ర విజయంపై సంతృప్తి వ్యక్తంచేశారు. దీంతో తన ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడం మరింత సంతృప్తినిచ్చిందన్నారు. బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతోందని, మైనారిటీలు, మహిళలు, గిరిజనులపై దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిరంకుశ బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. తన నాయకత్వంలో సాధించిన విజయాలు, తగిలిన ఎదురుదెబ్బలను గుర్తుచేసుకున్నారు. ఇక తన ఇన్నింగ్స్‌ ముగిశాయని, ఖడ్గే నేతృత్వంలో యువత ముందుకు రావాలని అన్నారు. భారత్‌ జోడో యాత్ర విజయానికిగాను తనయుడు, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని అభినందించారు. ఈ యాత్ర కాంగ్రెస్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా పరిణమిస్తుందన్నారు. ‘ఈ యాత్ర ఒక టర్నింగ్‌ పాయింట్‌. భారత ప్రజలు సామరస్యాన్ని, శాంతి, సమానత్వాన్ని, సహనాన్ని కోరుకుంటున్నారని స్పష్టంచేసింది. పార్టీలో నూతనోత్సాహాన్ని నింపింది. కాంగ్రెస్‌ ఎప్పుడు ప్రజల పక్షాన్నే నిలుస్తుందని, వారి కోసం పోరాడుతుందని తెలియజెప్పింది. యాత్ర కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు అభినందనలు తెలుపుతున్నా. యాత్రలో పాల్గొన్న సహచరులు, యువత, వృద్ధులు, లక్షలాది మంది ప్రజలందరికి కృతజ్ఞతలు. ఈ యాత్ర విజయానికి రాహుల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని సోనియాగాంధీ అన్నారు. 2024లో అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు నిబద్ధతతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయం చాలా కీలకమైనదని, దేశం, పార్టీ పట్ల ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్తకు ప్రత్యేక బాధ్యత ఉన్నదన్నారు. ‘ఇది కాంగ్రెస్‌కే కాదు దేశానికి కూడా సవాళ్లభరితమైన క్లిష్టసమయం. బీజేపీ, మోదీ ప్రతి వ్యవస్థను స్వాధీనపర్చుకొన్నారు’ అని సోనియాగాంధీ అన్నారు. కాగా, అధికారంలోకొస్తే అన్ని విధాల వివక్షకు చెక్‌ పెట్టే చట్టాన్ని తేవాలని ప్లీనరీ తీర్మానించింది. రాజకీయ, ఆర్థిక, అంతర్జాతీయ వ్యవహారాలపై తీర్మానాలనూ ఆమోదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img