Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దళితులు, మైనారిటీలపై అకృత్యాలకు నిరసనగా 11న చలో విజయవాడ

. అన్ని జిల్లాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు
. 7, 8 తేదీల్లో కర్నూలు, కడపలో పర్యటన
. సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపు
. దమనకాండపై సీఎం స్పందించరా: రామకృష్ణ
. మైనారిటీలకు రక్షణ కరువు: మధు
. మోదీ, జగన్‌కు చరమగీతం: గిడుగు రుద్రరాజు
. డాక్టర్‌ అచ్చెన్న మరణంపై జగన్‌ నోరు విప్పాలి: మందా కృష్ణమాదిగ
. దళితులపై వివక్ష: హర్షకుమార్‌
. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం: వర్ల రామయ్య

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో దళితులు, మైనారిటీలపై హత్యాకాండ కొనసాగుతోందని, ఈ అకృత్యాలను నిరసిస్తూ ఈనెల 11వ తేదీన (పూలే జయంతి రోజు) చలో విజయవాడ చేపట్టాలని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి అధ్వర్యంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశం పిలుపునిచ్చింది. డాక్టర్‌ అచ్చెన్న హత్యపై న్యాయపోరాటం కోసం ఈనెల 7న కర్నూలులోను, 8న కడపలోను పర్యటించాలని, దళిత, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా 26 జిల్లాల్లోను రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహిం చాలని సమావేశం తీర్మానించింది. దళితులు, మైనారిటీలపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను నిరసిస్తూ మంగళవారం విజయవాడ దాసరిభవన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. దీనికి అఖిలపక్ష పార్టీలు, దళిత, మైనారిటీ, ప్రజాసంఘాల నేతల హాజరయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు. వైఫల్యా లను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నించకూడదా?, యువతులపై అఘాయిత్యాలు, హత్యలు జరిగినా సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడరు?, జగన్‌ ఏమైనా పై నుంచి ఊడి పడ్డారా? అని రామకృష్ణ నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని చంపి మృతదేహాన్ని డోర్‌ డెలివరీ చేశారని గుర్తుచేశారు. బెయిల్‌పై బయటికి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికి సన్మానాలు, ఫ్లెక్సీలకు పాలాభి షేకాలు చేస్తారా? అని ప్రశ్నించారు. ఇదేనా దళితు లపై జగన్‌కు ఉన్న ప్రేమ అని ధ్వజమెత్తారు. సిగ్గు లేకుండా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలు జరిగితే దోషులకు శిక్షలు లేవన్నారు. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా అని నిలదీశారు. అధికారమదంతో వ్యవహరిస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇంతటి దుర్మార్గ పాలనను తన జీవితంలో చూడలేదన్నారు. అన్ని సంఘాలు ఐక్య కార్యాచర ణకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలకు రక్షణ కరువైందన్నారు. దళితులపై దాడులను అరికట్టాలని సీఎంకు లేఖ రాసి ఆర్నెళ్లు గడిచినా స్పందించలేదని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలో జాప్యం చేస్తున్నారని, పోలీస్‌ రాజ్యం నడుస్తోందని, పోలీసుల అండతో నియోజకవర్గానికో సామంత రాజు తయారయ్యాడని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాలకు అందాల్సిన ఫలాల్లో కేంద్రం కోతలు విధిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా మిన్నకుండిపోతోందన్నారు. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ ప్రతిపాదనలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హోదాకు తగ్గట్టుగా డీజీపీ వ్యవహరిండం లేదని, పోలీసుల అండతో దాడులు చేస్తున్నా చర్యలు లేవన్నారు.
కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలో దళితులు, మైనారిటీలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. హత్యలు, అత్యాచారాల కేసులలో ఏపీ నాలుగో స్థానంలో ఉందని, ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు సైతం అక్రమార్కులకే కొమ్ము కాయడం బాధాకరమని, మళ్లీ మోదీ, జగన్‌ అధికారంలోకి రాకూడదని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. హైకోర్టు జడ్జి నుంచి సామాన్యుల వరకు ఎవర్నీ వదలడం లేదని, భవిష్యత్తు తరాల కోసమైనా అందరూ నడుం కట్టాలని పిలుపునిచ్చారు.
ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపకుడు మందా కృష్ణ మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంతోపాటు దేశంలోనూ దళితులు, మైనారిటీలు దాడులు, అత్యాచారాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కులమతాలకతీతంగా ఎవరికి అన్యాయం జరిగినా ఖండిరచాల్సిందేనన్నారు. అనాది నుంచి దళితులకు అండగా వామపక్ష పార్టీలు పోరాటం చేస్తున్నాయని ప్రశంసించారు. దిశ ఘటనలో నిందితుల ఎన్‌కౌంటర్‌ను సీఎం జగన్‌ సమర్థించి, దిశ పేరుతో చట్టం తెచ్చారని గుర్తుచేశారు. అన్ని వర్గాల అమ్మాయిలకు జరిగిన అన్యాయంపై జగన్‌ అలాగే స్పందిస్తున్నారా అని ప్రశ్నించారు. దళితులు, మైనారిటీలపై జగన్‌ కపట ప్రేమ ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. కడప జిల్లాలో డాక్టర్‌ అచ్చెన్న, అనంతపురం జిల్లాలో దళిత యువత హత్యలపై ప్రభుత్వం నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. చలో విజయవాడకు ఎంఆర్‌పీఎస్‌ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
మాజీ ఎంపీ జి.హర్షకుమార్‌ మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులపై వివక్ష పెరిగిపోయిందన్నారు. దళితులకు సంబంధించిన అనేక పథకాలను రద్దు చేశారని, ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు దారిమళ్లించి నిర్వీర్యం చేశారన్నారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రులు ఉన్నా ఒక్కరికీ అధికారం లేదని, ఒక్క మంత్రి కూడా తన శాఖపై ప్రెస్‌మీట్‌ పెట్టిన దాఖలాలు లేవన్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో ఏం జరుగుతుందో ఆ మంత్రికే తెలియదన్నారు. అమ్మఒడి పథకంలో లబ్ధిదారులను ఏ విధంగా తగ్గించాలో కసరత్తు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో ఒక్క కేసులోనూ సరైన చార్జిషీట్‌ దాఖలు చేయలేదన్నారు. చలో విజయవాడకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలిరావాలని కోరారు.
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే ఎన్ని చట్టాలు ఉన్నా బూడిదలో పోసినట్లేనని విమర్శించారు. సీఎం జగన్‌కు ఇవేమీ తెలియకుండానే జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. తన వాళ్లను కాపాడటం కోసం అమాయకులను బలిచేస్తున్నారని, డాక్టర్‌ అచ్చెన్న హత్య కేసు నిందితులను ప్రభుత్వం కాపాడుతోందని, అవినీతిని ప్రశ్నించడమే అచ్చెన్న చేసిన తప్పా అని ప్రశ్నించారు. అమరేంద్ర అనే అధికారితో పాటు, జిల్లా ఎస్పీ, కలెక్టర్‌పైనా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలులో జగన్‌కు చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపిన వారిపై ఆ చట్టాన్ని బనాయిస్తున్నారని చెప్పారు. చలో విజయవాడకు టీడీపీ సంపూర్ణ మద్దతిస్తుందని ప్రకటించారు.
తొలుత మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌ స్వాగతోపన్యాసం చేస్తూ దళిత, మైనారిటీలపై దాడులు ఆగడం లేదని, దాడుల నియంత్రణకు పాలకులు కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూక్‌ షుబ్లీ మాట్లాడుతూ మైనారిటీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌…వారికి వెన్నుపోటు పొడిచారన్నారు. ఇన్సాఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌ అఫ్సర్‌ మాట్లాడుతూ అన్ని ముస్లిం సంఘాలను కలుపుకొని ప్రభుత్వ విధానాలపై పోరాడతామన్నారు. ఇండియన్‌ ముస్లింలీగ్‌ పార్టీ నాయకుడు బషీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఆరెస్సెస్‌, బీజేపీ కనుసన్నల్లో జగన్‌ పాలన కొనసాగుతోందన్నారు. వీసీకే పార్టీ నాయకులు విద్యాసాగర్‌ మాట్లాడుతూ దళిత, మైనారిటీలపై దాడులకు వ్యతిరేకంగా నిరంతర ఉద్యమాలు కొనసాగించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు డి.హరినాథ్‌, ఎంసీపీఐ నాయకులు ఖాదర్‌భాషా మాట్లాడుతూ దళితుడిని చంపి డోర్‌ డెలీవరీ చేసిన అనంతబాబు వ్యవహారంపై జగన్‌ ఎందుకు స్పందించలేదన్నారు.
సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ విజయవాడ నగర కార్యదర్శి ఎం.రామకృష్ణ మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అణగారిన వర్గాలపై దాడులు పెట్రేగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌పీఐ నాయకులు పి.ప్రసాద్‌, కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ విభాగం చైర్మన్‌ కొరివి వినయ్‌కుమార్‌, అమరావతి దళిత జేఏసీ నాయకులు పి.బాలకోటయ్య, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేశ్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్ల యూనియన్‌ నాయకులు మల్లికార్జునరావు తదితరులు ప్రసంగిస్తూ జగన్‌ ప్రభుత్వం దళిత, మైనార్టీ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తోందన్నారు.
కార్యక్రమంలో సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు సుంకర పద్మశ్రీ, విజయవాడ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు జేవీ ప్రభాకర్‌, ఉపాధ్యక్షుడు టి.మధు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, నాయకులు కళింగ లక్ష్మణరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జాన్సన్‌బాబు, నక్కి లెనిన్‌బాబు, కౌలు రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, కేవీపీఎస్‌ నాయకులు జి.నటరాజ్‌, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర నాయకులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, దళిత సంఘాల నాయకులు పరిశపోగు రాజేశ్‌, వివిధ దళిత, మైనార్టీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రనాయక్‌, పెంచలయ్య, రాష్ట్ర నాయకులు ఆర్‌.పిచ్చయ్య దళిత, సామాజిక అంశాలపై పాటలు పాడారు. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు వందన సమర్పణ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img