Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దామాషా పద్ధతిలో ఎన్నికలు

బీజేపీపై పోరుకు విపక్షాలు ఒక్కటి కావాలి

. ఎన్నికల ముందే అవగాహన మంచిది
. రాష్ట్రాలపై గవర్నర్ల పెత్తనం దారుణం
. సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా

విశాలాంధ్ర – హైదరాబాద్‌: దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నదని, దామాషా పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా డిమాండ్‌ చేశారు. దేశంలోనే అత్యంత ధనిక రాజకీయ పార్టీ బీజేపీి అని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఆ పార్టీ డబ్బును వెదజల్లుతోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. ఫాసిస్టు, మతోన్మాద బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికలకు ముందే జాతీయస్థాయిలో విపక్షాలు ఉమ్మడి అవగాహనకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీ యేతర రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, అధికారాలను మోదీ సర్కారు అణచివేస్తోందని రాజా ధ్వజమెత్తారు. సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్‌ కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, జాతీయ కార్యవర్గసభ్యులు చాడ వెంకటరెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసి రాజా హైదరాబాద్‌ మఖ్దుంభవన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జాతీయ విద్యావిధానాన్ని, జీఎస్‌టీని రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా రుద్దుతున్నదని విమర్శించారు. భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందని చెప్పారు. దేశసంపదను మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై తెలంగాణలో విచారణ కొనసాగుతోందని, మిగతా రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాగే ప్రవరిస్తోందని తెలిపారు. మోదీ హయాంలో సంక్షేమ భారత్‌…పెట్టుబడి భారత్‌గా మారుతోందని తెలిపారు. మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని, నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీ గాలికిపోయిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల పాలనా వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీి-ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలను గవర్నర్లు ముందుకు తీసుకెళుతున్నారని ఆరోపిస్తూ తమిళనాడు గవర్నర్‌ సనాతన ధర్మాన్ని ప్రస్తావించడాన్ని రాజా గుర్తుచేశారు. కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌సహా తెలంగాణలోనూ గవర్నర్ల ఆగడాలు శృతిమించాయని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక, ప్రాంతీయ పార్టీలు ఏకమై బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ వాస్తవాలు తెలుసుకోవాలి
మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికైనా వాస్తవ పరిస్థతులను అర్థం చేసుకోవాలని డి.రాజా సూచించారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెద్ద సమస్య కానప్పటికీ, ఆ పార్టీ ఇతర రాజకీయ పార్టీలతో కలిసి ముందుకెళ్లే అంశంలో తన ఆలోచనను మార్చుకోవాలని హితవు పలికారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష పార్టీల ఐక్యతకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండేళ్లలో సీపీఐ శతవార్షికోత్సవానికి చేరుకోబోతున్న సందర్భంగా పార్టీ సభ్యత్వాన్ని పది లక్షలకు పెంచాలని రాజా పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. సీపీఐని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని నిలువరించినందుకు సీపీఐ రాష్ట్ర సమితిని ఆయన అభినందించారు. డాక్టర్‌ కె.నారాయణ మాట్లాడుతూ విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభరణాలు తరలుతున్నందున ప్రైవేటు విమానాలను సైతం తనిఖీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు విమానాల ద్వారా నల్లధనం తరలిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. అజీజ్‌ పాషా మాట్లాడుతూ వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు ఏకమైతే బీజేపీని ఓడిరచడం తేలికన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులను అవమానించేలా అభ్యంతరకర ప్రసంగాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇప్పటి వరకు ఇలాంటివి ఐదువేల ప్రసంగాలు ఉన్నాయన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే పొత్తుల అంశంపై చర్చలు ఉంటాయని, అప్పటి వరకు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న స్థానాలను అడుగుతామన్నారు. బీజేపీని ఓడిరచే బలమైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img