Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దిగుబడికి దెబ్బే…

. ఉత్తరాదిలో 20 శాతం దెబ్బతిన్న మామిడి పంట
. దక్షిణాదిలో సుమారు 8 శాతం నష్టం
. అకాల వర్షాలు… ఈదురు గాలులే కారణం: ఐకార్‌ వెల్లడి

న్యూదిల్లీ : అకాల వర్షాలు, వడగళ్ల వాన, వాటికితోడు ఈదురు గాలులు మామిడి రైతుల తీపి ఆశలను చేదెక్కించాయి. అధిక దిగుబడి సంగతి సరే… కనీస దిగుబడి కూడా రాని పరిస్థితుల్లో వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యానికి మామిడి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దేశంలో మామిడి పంట 20 శాతం వరకు దెబ్బతిన్నట్లు ఐసీఏఆర్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ఉత్తర భారతంలో వడగళ్ల వాన, ఉరుములతో కూడిన వర్షం కారణంగా భారీ నష్టం వాటిల్లిందని అనేక మంది మామిడి రైతులు తెలిపారు. మామిడి భారతదేశంలో ఒక ముఖ్యమైన పండ్ల పంట, దీనిని ‘పండ్ల రాజు’ అని పిలుస్తారు. భారతదేశం మామిడి పండిరచే ప్రధాన దేశం, ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 42 శాతం వాటా ఇస్తోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురు గాలులు దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహార ధాన్యాలు, ఉద్యానవన పంటలపై ప్రభావం చూపాయి. ‘మొదటి అకాల వర్షాలు నష్టాన్ని కలిగించలేదు. కానీ తరువాత వర్షాలు, వడగళ్లు మామిడి పంటను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రస్తుతానికి మొత్తం నష్టం సుమారు 20 శాతం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము’ భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (హార్టికల్చర్‌) ఎ.కె.సింగ్‌ పీటీఐ కి చెప్పారు. మామిడి పంట నష్టం తరచుగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా దేశంలో మామిడి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌. ఒక్క ఉత్తర భారతదేశంలోనే మామిడి పంట నష్టం 30 శాతం ఉంటుందని అంచనా వేయగా, దక్షిణ భారతదేశంలో 8 శాతం కంటే తక్కువ నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. అయితే తాజా వివరాల కోసం రాష్ట్రాల నుంచి ఎదురుచూస్తున్నామని ఆయన తెలిపారు. 5 హెక్టార్ల మామిడి తోటను కలిగి ఉన్న లక్నోకు చెందిన మామిడి రైతు ఉపేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ‘మాల్‌-మలిహాబాద్‌ మామిడి కేంద్రం ప్రాంతంలో వడగళ్ల వాన కారణంగా 75 శాతం వరకు పంట నష్టం జరిగింది. అకాల వర్షాలు, వడగళ్ల వాన లేని ప్రాంతాలలో నష్టం తక్కువగా ఉంది. గత 30 సంవత్సరాలలో మార్చి 19 వరకు మామిడి పంట పరిస్థితి ఉత్తమంగా ఉంది. మార్చి 20 నుంచి అకాల వర్షాలు, వడగళ్లు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయి’ అని తెలిపారు. పూత దశలో అధిక తేమ నల్ల ఫంగస్‌కు దారితీసిందని అన్నారు. తఫారీ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ డైరెక్టర్‌ అతుల్‌ కుమార్‌ అవస్తీ మాట్లాడుతూ ‘పండ్లు వచ్చాయి. అయితే బలమైన ఉరుములు, బలమైన గాలి కారణంగా పండ్లు నేలరాలాయి. పంట నష్టం సుమారు 25 శాతంగా అంచనా వేయబడిరది’ అని తెలిపారు. తేమ ఎక్కువగా ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో మామిడి చెట్లకు తెగుళ్లు సోకుతున్నాయి. ఇది ఎగుమతి ప్రయోజనం కోసం నాణ్యమైన మామిడి లభ్యతపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. ఐసీఏఆర్‌సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ సబ్‌ట్రాపికల్‌ హార్టికల్చర్‌ డైరెక్టర్‌ టి.దామోదరన్‌ మాట్లాడుతూ సీతాపూర్‌ జిల్లా సరిహద్దులోని మాల్‌-మలిహాబాద్‌ ప్రాంతంలో ప్రధానంగా ఉరుములు, వడగళ్ల వాన కారణంగా 50 శాతం వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. అయితే లక్నో, హర్దోయ్‌, ఖుషీనగర్‌, గోరక్‌పూర్‌, అలీఘర్‌, సహరాన్‌పూర్‌, బారాబంకితో సహా ఏడు ప్రధాన మామిడి పండిరచే జిల్లాలలో ఆరింటిలో పంట పరిస్థితి ‘చాలా బాగుంది’ అని ఆయన చెప్పారు. 2021-22 పంట సంవత్సరంలో (జులైజూన్‌) దేశంలో మామిడి ఉత్పత్తి 210 లక్షల టన్నులుగా ఉంది. ప్రభుత్వ అంచనా ప్రకారం అంతకు ముందు సంవత్సరం 203.86 లక్షల టన్నులుగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img