Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దినసరి కూలీ అద్భుత సృష్టి.. దివ్యాంగురాలైన కుమార్తె కోసం రోబో తయారు

చేతులు కదపలేక, అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలైన కుమార్తెకు తినిపించడం మొదలుకుని అన్ని పనులూ దగ్గరుండి చూసుకోవాల్సి వస్తోంది. తండ్రి దినసరి కూలీ కాగా.. తల్లేమో దీర్ఘకాలిక వ్యాధితో రెండేళ్ల కిందట పూర్తిగా మంచాన పడిరది. దీంతో సాయంత్రం పని నుంచి ఇంటికొచ్చాక తండ్రి తినిపిస్తేనే పాపకు భోజనం. భార్య నిస్సహాయత, కూతురి కోసం ఏమీ చేయలేక ఆమె పడుతున్న వేదన అతడిని ఆలోచింపజేశాయి. ఓ రోబోను తయారు చేయాలని భావించాడు. రోబో తన కుమార్తెకు భోజనం పెట్టేందుకు సహకరిస్తుందని అనుకున్నాడు. అయితే, సాంకేతికతపై ఎలాంటి అవగాహన లేకపోయినా.. రోబో వంటి పరికరం కోసం ఏడాది కిందట అన్వేషణ ప్రారంభించాడు. కానీ, అలాంటిది ఎక్కడా లభించకపోవడంతో తానే తయారుచేయాలని నిర్ణయించుకుని, నాలుగు నెలల పాటు శ్రమించి విజయవంతమయ్యాడు.
వివరాల్లోకి వెళితే, దక్షిణ గోవాలోని పొండా తాలూకా బితోరా గ్రామానికి చెందిన బిపిన్‌ కదమ్‌ (40) దినసరి కూలీ. అతడికి భార్య, దివ్యాంగురాలైన 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఇంటి పట్టునే ఉండి కుమార్తె ఆలనాపాలనా చూసుకుంటున్న భార్య రెండేళ్ల కిందట అనారోగ్యానికి గురయ్యింది. ఆమె మంచానపడటంతో కుమార్తెకు భోజనం తినిపించడం సమస్యగా మారింది. దీంతో కదమ్‌ తన కుమార్తె ఎదుర్కొంటున్న సమస్యకు సాంకేతికతే ఒక పరిష్కారం చూపుతుందని భావించాడు. ఏడాది క్రితం నుంచి రోబో లాంటి పరికరం కోసం అన్వేషించాడు. ఎక్కడా లభించకపోవడంతో తానే సొంతంగా అలాంటి దానిని తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చాడు.
రోజులో 12 గంటల పాటు ఇతర పనులు చేసుకుని, మిగిలిన సమయంలో ఆన్‌లైన్‌లో శోధించిన సాఫ్ట్‌వేర్‌పై అవగాహన పెంచుకున్నాడు. నాలుగు నెలలు పాటు శ్రమించి ఒక రోబోను తయారుచేసి దానికి ‘మా రోబో’ అని పేరు పెట్టాడు. పూర్తిగా వాయిస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఆధారంగా పనిచేసే ఈ రోబో చేతిలో ఉండే పళ్లెంలో ఆహారం పెడితే అది అమ్మాయికి తినిపిస్తుంది. వాయిస్‌ కమాండ్‌ను వినియోగించుకుని.. ఆహారాన్ని కూర లేదా పప్పుతో కలిపి తినాలని భావిస్తోందా? అనేది ఆ అమ్మాయి చెబితే .. ఆ రోబో ఆ విధంగానే పనిచేస్తుంది. ఈ ఆవిష్కరణను గోవా స్టేట్‌ ఇన్నోవేషన్‌ కౌన్సిల్‌ ప్రశంసించింది. ‘మా రోబో’ను వాణిజ్య పరంగా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఆర్థిక సాయాన్ని కూడా కదమ్‌కు అందిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img