Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ది కశ్మీర్‌ ఫైల్స్‌ ఓకే..లఖింపూర్‌ ఫైల్స్‌ కూడా తీయాలిగా

: అఖిలేశ్‌

లక్నో: ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై బీజేపీకి ఎందుకంత ప్రేమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సూటిగా ప్రశ్నించారు. కశ్మీరీ పండిట్ల జీవితాలపై కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాను రూపొందించారని, మరి లఖింపూర్‌లో రైతులను నిర్ధాక్షిణ్యంగా జీపులతో తొక్కించి చంపిన ఘటనపై ‘లఖింపూర్‌ ఫైల్స్‌’ సినిమా నిర్మించాల్సిన అవసరం ఉందని అఖిలేశ్‌ పేర్కొన్నారు. 2021 అక్టోబరు 3న లఖింపూర్‌లో హింస చెలరేగింది. మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాడు రైతులు నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీశ్‌ మిశ్రా తన కాన్వాయ్‌తో రైతులను తొక్కించి నలుగురు అన్నదాతల మరణానికి కారణమయ్యారు. ‘కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా రూపొందించారు. సంతోషమే. అదే సమయంలో రైతులను దారుణంగా చంపిన ఘటనపై లఖింపూర్‌ ఫైల్స్‌ సినిమా ఎందుకు నిర్మించలేదు. కేంద్రమంత్రి తనయుడి అహంకారానికి నలుగురు అన్నదాతలు జీపు చక్రాల కింద నలిగి చనిపోయారు’ అని అఖిలేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అఖిలేశ్‌ పైవిధంగా స్పందించారు. వివేక్‌ అగ్నిహోత్రి రచన, దర్శకత్వంలో ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా నిర్మితమైంది. 1990 దశకంలో కశ్మీరు లోయలో కశ్మీరీ పండిట్ల జీవిత ఇతివృత్తంగా సినిమా నిర్మాణం జరిగింది. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాకు దేశంలో మొదటిసారిగా పన్నులు లేకుండా చేసిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. ఆ తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలు`మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, హరియాణా, గోవా, త్రిపుర, ఉత్తరాఖండ్‌ కూడా ఆ సినిమాను పన్నుల నుంచి మినహాయించాయి. యూపీలో బీజేపీ 255 సీట్లు గెలుచుకొని తిరిగి అధికారం చేపట్టడంపై స్పందిస్తూ సమాజ్‌వాదీలు(సోషలిస్టులు) నైతిక విజయం సాధించారని, తమ పార్టీ బలం పెరగగా బీజేపీ బలం బాగా తగ్గిందని అఖిలేశ్‌ చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img