Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దీర్ఘకాల కరోనా బాధితుల్లో 200కు పైగా రోగ లక్షణాలు

ప్రతి ఆరుగురిలో ఒకరికి ఇతర ఆరోగ్య సమస్యలు
ప్రపంచస్థాయి అధ్యయనంలో వెల్లడి

కరోనా దీర్ఘకాల సమస్యతో బాధపడుతున్న వారిలో రెండు వందలకు పైగా లక్షణాలు ఉంటాయని ఇటీవల ఒక అధ్యయనం నివేదిక వెల్లడిరచింది. కరోనా సోకిన ప్రతి ఆరుగురిలో ఒకరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నారని గతంలో బ్రిటన్‌లో ఓ అధ్యయనం తెలిపింది. తాజాగా అంతర్జాతీయస్థాయిలో జరిగిన మరో అధ్యయనంలో దీర్ఘకాలిక కరోనాతో బాధ పడిన వారిలో దాదాపు రెండు వందల లక్షణాలకు పైగా ఉంటాయని గుర్తించారు. దీర్ఘకాలిక కొవిడ్‌ బాధితుల్లో బ్రెయిన్‌ ఫాగ్‌ నుంచి మొదలుకొని చెవిలో పోటు వరకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, కొందరిలో మనోవైకల్యం కలుగుతుందని, మరికొందరిలో వణుకు వంటి లక్షణాలు కనిపించాయని నివేదించారు. జ్ఞాపకశక్తి సమస్యలు, మానసిక అశాంతి, నీరసం, దురద, నెలసరి హెచ్చుతగ్గులు, లైంగిక బలహీనత, గుండెదడ, ఆయాసం వంటి అనేక లక్షణాలు కొవిడ్‌ బాధితుల్లో కనిపించాయని అధ్యయనం వెల్లడిరచింది. ప్రఖ్యాత అంతర్జాతీయ పత్రిక లాన్సెట్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం యాభై ఆరు దేశాల నుంచి దీర్ఘకాల కొవిడ్‌తో బాధపడుతున్న 3672 మందిపై స్టడీ జరిగింది. వీరిలో 203 లక్షణాలు గుర్తించారు. 203 లక్షణాలలో అరవై ఆరు లక్షణాలు ఏడునెలల వరకు కొనసాగినట్లు తేలింది. లాంగ్‌ కొవిడ్‌ బాధితులలో చాలామందిలో కనిపించిన ప్రధాన సమస్యలు నీరసం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, డయేరియా, కళ్లు మసకబారడం, దద్దుర్లు, గుండె దడ, మూత్రాశయంపై నియంత్రణ కోల్పోవడం ప్రధానంగా ఉన్నాయి. 2454 మంది రోగులు ఏడు నెలల వరకు 14 శాతం లక్షణాలు కలిగి ఉన్నారు. కొంతమందిలో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉన్నాయి. దీర్ఘకాలిక కరోనా రోగులకు 10 అవయవ వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయని నివేదిక వెల్లడిరచింది. కరోనా మహమ్మారి సోకినవారిలో న్యూరో సైకియాట్రిక్‌, న్యూరోలాజికల్‌ లక్షణాలతో పాటు అసహనం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది రోగులు కరోనా తర్వాత తమకు పని చేసేందుకు శక్తి లేదని ఉద్యోగాలు పోగొట్టుకున్నామని, దీర్ఘకాలిక సెలవులు పెట్టామని పేర్కొన్నట్లు సమాచారం. మరో 45 శాతం మంది అంతకుముందులా తాము పనిచేసేందుకు సాధ్యం కావడం లేదని చెప్పినట్లుగా అధ్యయనం పేర్కొంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న న్యూరో సైంటిస్ట్‌ అథ్నా అక్రమి మాట్లాడుతూ చాలామంది కొవిడ్‌ తర్వాత శ్వాసకోశ సమస్యలపై ప్రధానంగా దృష్టి పెట్టారని, అయితే దీంతో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని, వైద్యులు సంపూర్ణ దృష్టితో రోగులను పరిశీలించాలని సూచించారు. కరోనా బారిన పడి 16 నెలలు అయినా రోగ లక్షణాలతో బాధపడుతున్న వారు ఇంకా ఉన్నారని చెప్పారు. కరోనా మహమ్మారి వచ్చిన ప్రతి ఆరుగురిలో ఒకరు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా అధ్యయనం తేల్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img