Friday, April 19, 2024
Friday, April 19, 2024

దూసుకొస్తున్న మాండస్‌

. దక్షిణ కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
. రాయలసీమలో అతి భారీవర్షాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి/విశాఖపట్నం:
మాండస్‌ తుపాను తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా దూసుకొస్తోంది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడులోని చెన్నై నగరం సహా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తీవ్ర తుపానుగా మారింది. ఇది తీరం దిశగా వేగంగా కదులుతోంది. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడిరచారు. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడులోని చెన్నై సహా అనేక ప్రాంతాలకు ఐఎండీ భారీ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ తుపాను కరైకాల్‌కు, చెన్నైకి 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడిరచింది. ప్రస్తుతం తీవ్ర తుపానుగా కొనసాగుతున్న మాండస్‌ రానున్న కొన్ని గంటల్లో బలహీనపడి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున మామల్లాపురం సమీపంలో తీరం దాటే అవకాశముందని పేర్కొన్నారు. తుపాను తీరం దాటే సమయంలో 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నట్లు తెలిపారు. తీవ్ర తుపానుగా మాండస్‌ కొనసాగుతోన్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడిరచింది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబరు, విశాఖపట్నం పోర్టుకు రెండో నెంబరు హెచ్చరికను జారీ చేశారు. తుపాను ప్రభావంపై ఇప్పటికే జిల్లాల అధికారులకు విపత్తుల నిర్వహణ సంస్థ అనేక సూచనలు చేసింది. తుపాను ప్రభావం చూపే జిల్లాల్లోని 210 మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయ చర్యల కోసం మొత్తం 5 ఎన్డీఆర్‌ఎఫ్‌, 4 ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశారు. ప్రకాశం జిల్లాకు రెండు, నెల్లూరుకు మూడు, తిరుపతికి రెండు, చిత్తూరుకు రెండు చొప్పున సహాయ బృందాలను అధికారులు కేటాయించారు.
సూళ్లూరుపేట నియోజకవర్గం తడకుప్పంలో తీరప్రాంతంలో ఉంటున్న జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం చేపట్టారు. జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక తుపాను ప్రభావంతో తీరం వెంబడి ఉత్తరాంధ్ర వరకు వర్షాలు పడుతుండడంతో ఈదురు గాలులకు శీతల గాలులు తోడై ప్రజలంతా వణికిపోతున్నారు. గోదావరి జిల్లాల్లో ఓడలరేవు, అంతర్వేది, కాట్రేనికోన ప్రాంతాల్లో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్నాయి. సముద్రం పది మీటర్లు ముందుకు చొచ్చుకువచ్చింది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్‌ సెలవు ప్రకటించారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి తెలిపారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్లను ఆదేశించినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img