Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ

. ప్రజాస్వామ్యానికి మోదీ పాతర
. ఆదానీకి మోదీ, జగన్‌ వత్తాసు
. నేడు, రేపు ‘పోలవరం’పై సామూహిక దీక్షలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : సీబీఐ, ఈడీ, ఐటీతోపాటు పార్లమెంట్‌లో అనర్హత వేటులను ప్రయోగించి మోదీ అన్ని రాజకీయ పార్టీలను భయబ్రాంతులకు గురిచేస్తూ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. విజయవాడ దాసరిభవన్‌లో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, కేవీవీ ప్రసాద్‌తో కలిసి ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామిక హక్కులను మోదీ ఏ మాత్రమూ గౌరవించడం లేదని, హిండెన్స్‌బర్గ్‌ రెండో నివేదిక ఇవ్వడానికీ సిద్ధమయ్యిందనీ, అయినా ఆదానీని మోదీ వెనుకేసుకొస్తున్నారని రామకృష్ణ తప్పుపట్టారు. ఆదాని వ్యవహారంపై జేపీసీ అడిగితే ఎందుకు వేయరు..?, పైగా ప్రశ్నించినందుకు రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తారా?, మోదీ అవినీతిపై నిలదీసినందుకు చట్టసభల్లో నుంచి బయటకు గెంటేస్తారా? అని నిలదీశారు. కాంగ్రెస్‌ ఎంపీలను రాష్ట్రపతిని కలవకుండా అడ్డుకుంటున్నారని, ఇది చాలా దుర్మార్గమన్నారు. ప్రపంచం అంతా ఆదానీ గురించి మాట్లాడుతుంటే జగన్‌ మాత్రం కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి, ఆదానీకి భూములు కట్టబెట్టారని విమర్శించారు. వెడ్డింగ్‌ కార్డు ఇచ్చే పేరుతో ఆదానీజగన్‌ మధ్య జరిగిన నాలుగు గంటల భేటీ వివరాలను ప్రజలకు వెల్లడిరచాలని డిమాండ్‌ చేశారు. మోదీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ఆదానీ అవినీతి వ్యవహారంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి రోజైన ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి సీపీఐ జాతీయ సమితి పిలుపునిచ్చిందని, దానిలో భాగంగా రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం తదితర వామపక్ష పార్టీలు విస్తృత ప్రచార కార్యక్రమానికి సిద్ధమవుతున్నాయన్నారు. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి ఉందని, ఆదానీ ఆర్థిక అవకతవకల వ్యవహారంపై జగన్‌ ఎలాగూ మాట్లాడరని, మరి ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తే చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదన్నారు. మోదీ ప్రజాస్వామ్యానికి పాతరేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండటం తగదని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు గళం విప్పాలన్నారు.
అకాల వర్షాలకు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, పంట నష్టాలకు గురైన ప్రాంతాలను ఈ నెల 29వ తేదీ నుంచి సీపీఐ, రైతు సంఘం రాష్ట్ర నాయకత్వ బృందం పరిశీలిస్తుందని, ఆ దిశగా తమ సమితి సమావేశాల్లో తీర్మానించినట్లు రామకృష్ణ వెల్లడిరచారు. పంట నష్టాలపై తమ బృందం అధ్యయనం చేసి నష్టం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి తక్షణమే దెబ్బతిన్న పంటను పరిశీలించి పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు.
పోలవరం ప్రయోజనాలను కాపాడాలని, ఎత్తు తగ్గించకుండా పూర్తి స్థాయి ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27, 28 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు వివరించారు. 28న విశాఖలోను, 29న అనంతపురంలోనూ రౌండుటేబుల్‌ సమావేశాల్ని ఏర్పాటు చేస్తామన్నారు. 150 అడుగుల ఎత్తులో(196 టీఎంసీల సామర్థ్యం) ఉండాల్సిన ప్రాజెక్ట్‌ను 130 అడుగులకు కుదించి, ఆ లోపున ఉన్న వారికే నష్టపరిహారం ఇస్తామని చెప్పడాన్ని పూర్తిగా తప్పుపట్టారు. 150 అడుగులు కన్నా ఎత్తు తగ్గిస్తే దాని ప్రయోజనాలు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు దక్కబోవన్నారు. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణాడెల్టాకు సాగునీరు అందుతుందని, రాయలసీమ ప్రాంతానికి నీరు వస్తుందని వివరించారు. గోదావరి డెల్టా ప్రాంతమూ సస్యశ్యామలం అవుతుందని నొక్కిచెప్పారు. సీఎం జగన్‌ ఇటీవల జరిగిన అసెంబ్లీలోనూ పోలవరాన్ని మా నాన్న (వైఎస్‌ఆర్‌) ప్రారంభించారని, దాన్ని నేను (జగన్‌) పూర్తి చేస్తానంటూ మాట్లాడి, ఇప్పుడు ఎత్తు తగ్గిస్తుంటే ఏం చేస్తున్నాంని రామకృష్ణ ప్రశ్నించారు. జగన్‌ పిరికిపంద చర్యలతో రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా జగన్‌ ప్రవర్తిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతున్నందున కేంద్రంపై జగన్‌ ఎందుకు ఒత్తిడి చేయడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ మేల్కొని రాజకీయ పార్టీలను ఆహ్వానించి, వారిని దిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img