Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

కొత్తగా 4,041 పాజిటివ్‌ కేసులు
దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కోలుకున్నవారి కంటే కొత్త కేసులు అధికంగా ఉండటంతో మరోసారి యాక్టివ్‌ కేసులు 20 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2,363 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు 1,000కిపైగా కేసులు నమోదయ్యాయి. ముంబయిలో అత్యధికంగా 704 కేసులు వెలుగుచూశాయి. దేశంలోని నమోదయిన కొత్త కేసుల్లో సింహభాగం కేరళ, మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ ప్రభావం కొత్త కేసులు, బాధితుల సంఖ్యపై కనిపిస్తోంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచిన గణాంకాల ప్రకారం.. గురువారం దేశవ్యాప్తంగా 4.25 లక్షల మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 4,041 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు నమోదయిన 3,712 కొత్త కేసుల కంటే ఈ సంఖ్య 300 అధికం. అంతేకాదు, దేశంలో 84 రోజుల తర్వాత మొదటిసారి అత్యధిక కేసులు నమోదుకావడం గమనార్హం. కేరళలో 1,370, మహారాష్ట్రలో 1,045 మందికి వైరస్‌ నిర్ధారణ కావడంతో ఆ రెండు రాష్ట్రాల్లోనే రెండు వేలకు పైగా కేసులున్నాయి.ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు ఒకశాతానికి చేరువైంది. ప్రస్తుతం 0.95 శాతంగా ఉంది. అలాగే, వీక్లీ పాజిటివిటీ రేటు కూడా 0.73 శాతానికి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో పాజిటివిటీ రేటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కోరారు. మరోసారి ఆంక్షల్లోకి వెళ్లకూడదనుకుంటే.. స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల్లో పెరుగుదల గణనీయంగా ఉంది. గురువారం 19,509గా ఉన్న యాక్టివ్‌ కేసులు.. ఒక్కసారిగా 21,177 (0.05 శాతం)కు చేరాయి. ఇప్పటి వరకూ దేశంలో 4.31 కోట్ల మందికిపైగా వైరస్‌ బారినపడ్డారు. రికవరీల వాటా 98.74 శాతంగా కొనసాగుతోంది. ఇటు, 12.05 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 193.43 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయని కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img