Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దేశం ఎప్పుడో దివాలా తీసింది.. పాక్‌ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతోంది. త్వరలోనే దాయాది దివాలా తీయనుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే తమ దేశం దివాలా తీసిదంటూ ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా మొహమూద్‌ ఆసిఫ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దివాలా తీసిన పాకిస్థాన్‌లోనే మనమంతా బతుకుతున్నామని వాపోయారు. దేశంలో ఈ పరిస్థితికి రాజకీయ, సైనిక, పరిపాలనా వ్యవస్థలే కారణమని ఆయన నిందించారు.సియోల్‌కోట్‌లో ఓ కార్యక్రమంలో పాక్‌ రక్షణ మంత్రి ఆసిఫ్‌ మాట్లాడుతూ ‘‘పాకిస్థాన్‌ దివాలా తీయనుందని మీరు వినే ఉంటారు.. కానీ ఇప్పటికే తీసేసింది. మనం దివాలా తీసిన దేశంలోనే బతుకుతున్నాం’’ అని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను అడుక్కోవడం వల్ల పాక్‌కు ప్రయోజనం లేదని ఆసిఫ్‌ పేర్కొన్నారు. పాక్‌ సమస్యకు ఐఎంఎఫ్‌ దగ్గర పరిష్కారం లేదని, మన దేశంలోనే ఉందని తెలిపారు. గత ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులతో పోల్చిన ఆసిఫ్‌.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులకు వారే కారణమని ఆరోపించారు. ‘‘రెండున్నరేళ్ల కిందట మనం ఉగ్రవాదులను అధికారంలోకి తెచ్చాం.. ఇప్పుడు దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులకు వారే కారణం’’ అని ఇటీవల దేశంలో పాక్‌ తాలిబన్లు జరుపుతున్న దాడులను ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. ఖరీదైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెండు గోల్ఫ్‌ క్లబ్‌లను విక్రయిస్తే పాకిస్థాన్‌ రుణంలో నాలుగింట ఒక వంతు చెల్లించవచ్చని ఆయన సూచించారు.33 ఏళ్లుగా పార్లమెంట్‌ సభ్యుడిగా ఉన్నానని, గత 32 ఏళ్లలో దేశ రాజకీయాలు అవమానకరంగా మారడాన్ని చూశానని అన్నారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం ద్వారా ఆర్థిక లోటును నియంత్రించేందుకు ప్రధాన మంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ అన్ని ప్రభుత్వ సంస్థలలో ప్రధాన పొదుపు చర్యలను ప్రకటిస్తారని తెలిపారు. పాక్‌ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. వార్షిక ద్రవ్యోల్బణం ఈ వారంలోనే దాదాపు 40 శాతం మేర పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల కారణంగా నగదు కొరత ఉన్న పాకిస్థాన్‌లో ఈ వారం ద్రవ్యోల్బణం 38.42 శాతానికి చేరింది.ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి గత కొన్ని వారాలుగా పాకిస్థాన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నా.. స్వల్పంగా విజయం సాధించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (%Iవీఖీ%) డిమాండ్లను నెరవేర్చడానికి పాక్‌ ప్రభుత్వం కొత్త పన్నులు విధించడం, పెట్రోలియం ధరలను పెంచడం సహా ఇప్పటికే అంగీకరించిన 7 బిలియన్ల డాలర్ల ఒప్పందం కింద 1.1 బిలియన్‌ డాలర్లను విడుదల చేయడంతో పాటు ఇటీవలి ద్రవ్యోల్బణం పెరిగింది.మినీ-బడ్జెట్‌ బిల్లు ద్వారా రూ. 170 బిలియన్లను సేకరించేందుకు కొత్త పన్నులు విధించడం ద్వారా పాక్‌ అధికారులు గత వారంలో ప్రజలను షాక్‌కు గురిచేశారు. అపూర్వమైన ద్రవ్యోల్బణం ప్రతి ఇంటిపై ప్రభావం చూపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img