Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశం కోసమే 27న భారత్‌ బంద్‌

మద్దతు ఇవ్వకుంటే జగన్‌, బాబు చరిత్ర హీనులౌతారు
బంద్‌ తరువాత దేశ రాజకీయాల్లో మార్పు తప్పదు
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ

కర్నూలు : రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న చేపట్టనున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ పిలుపు నిచ్చారు. సీపీఐ జన ఆందోళనలో భాగంగా అనంతపురంలో ప్రారంభమైన పాదయాత్ర యాత్ర రెండవ రోజు బుధవారం కర్నూలు చేరింది. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి మౌర్యన్‌, రాజ్‌విహార్‌ మీదుగా పాదయాత్ర కలెక్టరేట్‌కు చేరుకుంది. పాదయాత్ర అగ్రభాగాన సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యుడు జి ఓబులేశు, హరినాథ్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు పీ రామచంద్రయ్య, వ్యవసాయకార్మికసంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి ఆవులశేఖర్‌, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి చంద్రానాయక్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు ఎస్‌ఎన్‌ రసూల్‌, మునెప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు నిలిచారు. పాదయాత్రలో జిల్లా నలుమూలల నుంచి సీపీఐ , ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద గిడ్డయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో రామకృష్ణ మాట్లాడుతూ దేశంలో 70శాతం సంపద అంతా ఒక్కశాతం ఉన్న ధనవంతుల చేతిలో ఉందన్నారు. అంబానీ, ఆదానీల ఆస్తులు వందల శాతం పెరిగిపోతూ ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో చేరుతున్నాయన్నారు. విమానాలు, రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్‌లు, పరిశ్రమలు, పోర్టులు ఆదాని, అంబానిలకు అప్పగిస్తున్నార న్నారు. విశాఖ ఉక్కుకోసం కమ్యూనిస్టులు ఎన్నో పోరాటాలు చేయడమే కాకుండా ,32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నామనీ, అటువంటి విశాఖ ఉక్కుప్యాక్టరీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తాననడం దుర్మార్గమన్నారు. వ్యవసాయంను కార్పొరేట్‌కు అప్పగి ంచడం కోసం చేసిన 3 నల్లచట్టాలను రద్దుచేయాలన్నారు. నల్లచట్టాలకు వ్యతిరేకంగా 10నెలలుగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో కరోనకు కూడా భయపడకుండా చేస్తున్న పోరాటం చరిత్రాత్మకమైందన్నారు. వారి పోరాటానికి మద్దతు ఇస్తున్నామన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబులు మోదీని చూసి భయపడుతున్నారు. ఈ నెల 27న జరిగే బంద్‌కు వారు మద్దతు ఇచ్చి ఉద్యమంలో కలసి రాకపోతే చరిత్ర హీనులౌతారన్నారు.మోడీ కళ్లు తెరిపించేందుకే బంద్‌ నిర్వహిస్తున్నామన్నారు. బంద్‌ తరువాత దేశరాజకీయాలు మారుతాయన్నారు. ఓబులేశు మాట్లాడుతూ విదేశాలలో ఉన్న నల్లడబ్బును తెప్పించి అందరి అకౌంట్‌లో 15లక్షలు వేస్తానని, రైతు ఆదాయం రెట్టింపు చేస్తానని, సంవత్సరానికి రెండుకోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్ని ఓట్టికూతలు అబద్దాలే అని ఎద్దేవా చేశారు. రైతుల ఆదాయం పెంచుతామని చెప్పి రైతులు పండిరచిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. హరనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే మేధావులు, రైతులను ఎన్డీయే ప్రభుత్వం జైళ్లలో పెడుతోందన్నారు. మోదీ నిరంకుశ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 27న చేపడుతున్న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె జగన్నాధం, నబీరసూల్‌, రంగనాయులు, గురుదాస్‌, పంపన్నగౌడ్‌, బాబాపకృద్దీన్‌, రాధాకృష్ణ, సుంకయ్య, రామకృష్ణారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి పీ గోవిందు, సహాయ కార్యదర్శి చంద్రశేఖర్‌, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రంగన్న, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, ధనుంజయ, శ్రీరాములు, వైఎఫ్‌ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు శ్రీనివాసులు, కారుమంచి, మహిళా సమాఖ్య అనంతపురం జిల్లా కార్యదర్శి పద్మావతి, కర్నూలు జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మీ, ఏఐటీయూసీ రాష్ట్రకార్యదర్శి లలితమ్మ, మనోహర్‌మాణిక్యం, రాజాసాహెబ్‌, తిమ్మయ్య, సీపీఐ, వివిధ ప్రజాసంఘాల, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img