Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశవ్యాప్త ఉద్యమం రైతు సదస్సులో వక్తల సూచన

న్యూదిల్లీ : కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. గురువారం సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన అఖిల భారత రైతుల సదస్సు మొదటి రోజు సమావేశం మోదీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంపై దృష్టిసారించింది. చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనకు తొమ్మిది నెలలు పూర్తయినందుకు సూచికగా నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సును భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నాయకుడు రాకేష్‌ తికైత్‌ ప్రారంభించారు. ‘తొమ్మిది నెలల తర్వాత కూడా ప్రభుత్వం ఇంకా రైతులతో చర్చలకు సిద్ధం కాకపోవడం బాధాకరం. కానీ మనం నిరుత్సాహానికి గురికాకూడదు. సదస్సు సమయంలో గత తొమ్మిది నెలల్లో మనం ఏమీ కోల్పోయాం, ఏమీ సాధించాము అనే దానిని మనం ప్రతిబింబిస్తాము’ అని ఆయన అన్నారు. ఈ సదస్సులో 22 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 300 రైతు, వ్యవసాయ కార్మికుల యూనియన్లు, సంఘాలకు చెందిన ప్రతినిధులు, అలాగే 18 అఖిల భారత ట్రేడ్‌ యూనియన్లు, తొమ్మిది మహిళా సంఘాలు, 17 విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కాగా సదస్సు మొదటి రోజున మూడు సెషన్లు నిర్వహించారు. ఒకటి మూడు వ్యవసాయ చట్టాలపై, మరొకటి పారిశ్రామిక కార్మికులకు సంబంధించి, మూడవది, వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ పేదలు, గిరిజన సమస్యలకు సంబంధించినదని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఈ మూడు సెషన్లలో మాట్లాడిన వక్తలు.. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు, ఆదివాసీలు, సామాన్య ప్రజలతో కూడిన ఈ ఉద్యమాన్ని విస్తరింపజేయాలని గట్టిగా సూచించారు. తద్వారా ‘కిసాన్‌ ఆందోళన్‌’ను దేశవ్యాప్త ఉద్యమంగా విస్తరింపజేయాలని పిలుపు ఇచ్చారు’ అని వివరించింది. ‘సదస్సు నిర్వాహక కమిటీ కన్వీనర్‌ అశీష్‌ మిట్టల్‌ ముసాయిదా తీర్మానాలను ప్రతినిధుల ముందు ఉంచారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)పై చట్టపరమైన హామీ ఇచ్చేలా మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేలా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పోరాటాన్ని తీవ్రతరం చేసి, విస్తరించాలని ప్రజలకు పిలుపు ఇచ్చింది’ అని ప్రకటన వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img