Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దేశవ్యాప్త సమ్మె..కదం తొక్కిన కార్మికసంఘాలు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలకు చెందిన సంయుక్త ఫోరమ్‌ ఇచ్చిన పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె సోమవారం ఉదయం ప్రారంభమైంది. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మెలో బ్యాంక్‌ ఉద్యోగులు, ఇతర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు రావాలని కోరుతూ… కార్మిక, కర్షక సంఘాలు కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి. నేడు, రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాల సమ్మెకు మద్దతుగా సుమారు 60 లక్షల మంది కార్మికులు పనులను బహిష్కరించనున్నట్లు రైల్వే యూనియన్‌ తెలిపింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మినహా అన్ని వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ, సహకార బ్యాంకులు, పోస్టాఫీసులు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. లాభాల్లో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్రపూరితంగానే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు, రవాణా, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌, కోల్‌, స్టీల్‌, ఆయిల్‌, టెలికాం, పోస్టల్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, కాపర్‌, వంటి రంగాలకు చెందిన కార్మిక సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. రైల్వే, రక్షణ రంగాలకు చెందిన సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దేశ రాజధాని ఢల్లీిలో ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను, బ్యాంకింగ్‌ చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా బ్యాంక్‌ యూనియన్లు నిరసన తెలుపుతున్నాయి. ఏపీలో సమ్మె కొనసాగుతోంది. కేరళలో బంద్‌ ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సేవలు నిలిచిపోయాయి. సమ్మె నుండి అత్యవసర సేవలను మినహాయించారు. రైల్వే స్టేషన్స్‌, ఆస్పత్రులు వెళ్లే ప్రయాణికుల కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమబెంగాల్‌లో పలు ప్రాంతాల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పలువురు వామపక్ష కార్యకర్తలు కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌, డుమ్‌డుమ్‌, బారాసత్‌, బెల్గారియా, జోరునగర్‌, దోమ్‌జూర్‌ ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై బైఠాయించారు. గోల్‌పార్క్‌, లేక్‌ టౌన్‌, బగౌతియాలతో పాటు కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో రహదారులను దిగ్భందించారు. ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాల్లోనూ సమ్మె కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img