Friday, April 19, 2024
Friday, April 19, 2024

ద్వేషం, అసహనాన్ని ప్రజలు అడ్డుకోకపోతే… సమాజం అధః పాతాళానికే

సోనియాగాంధీ ఆందోళన
న్యూదిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ద్వేషం, అసహనం, మతోన్మాదం దేశాన్ని చుట్టుముట్టాయని విమర్శించారు. వీటిని అరికట్టకపోతే సమాజం అధఃపాతాళికి పడిపోవడం ఖాయమని హెచ్చరించారు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలో ఆమె వ్యాసం రాస్తూ మోదీ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇక వీటిని కొనసాగించడానికి ఏమాత్రం ప్రజలు అంగీకరించవద్దని ఆమె కోరారు. విద్వేష కార్చిచ్చును ఆర్పేయాలని.. ఆ సునామీని అడ్డుకోవాలని, లేకుంటే గత తరాలు కష్టపడి నిర్మించినవన్నీ బూడిదవుతాయన్నారు. బహుళత్వాన్ని, శాంతిని త్యజించలేమని సోనియాపేర్కొన్నారు. నోబెల్‌ గ్రహీత రవీంద్రనాథ్‌ ఠాకూర్‌ ‘గీతాంజలి’లోని 35వ వ్యాఖ్యాన్ని తన వ్యాసంలో ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితులకు అది సరిగ్గా సరిపోతుందన్నారు. ‘ఏ వైరస్‌ రైజెస్‌’ శీర్షికన ఈ వ్యాసం ప్రచురితం అయింది. ఇందులో భారతదేశం శాశ్వతంగా విభజిత స్థితిలోనే ఉండాలా అంటూ ఆమె ప్రశ్నించారు. అదే తమకు ఉత్తమమని ప్రజలు నమ్మాలని ప్రస్తుత పాలకులు భావిస్తున్నారన్నారు. ‘వేసుకునే వస్త్రాలు మొదలు తినే తిండి, పూజించే దేవుడు, ఆచరించే మతం, చేసుకునే పండుగులు, మాట్లాడే భాష’ అంతా శాశించాలని చూస్తున్నారని విమర్శించారు. హిజాబ్‌ వివాదం, రామ నవమి ఘర్షణలు, జేఎన్‌యూలో హింస నేపథ్యంలో సోనియాగాంధీ వ్యాసానికి ప్రాధాన్యత ఏర్పడిరది. దేశ ఉజ్వల భవిష్యత్‌ కోసం, యువ మేధస్సులను ఉత్పాదక వ్యాపారాల్లో నిమగ్నం చేసేందుకు వనరులను వాడాల్సిందిపోయి వాటిని తాము ఊహించుకున్న గతం కోసం వర్తమానాన్ని మార్చేయాలని అనుకోవడం హాస్యాస్పదమన్నారు. భారతీయ వైవిధ్యత గురించి ప్రధాని గొప్పగా మాట్లాడుతుంటారుగానీ వాస్తవానికి శతాబ్దాల దేశ గొప్ప చరిత్ర మంటగలిసిపోతోంది. ప్రజలను విభజించేందుకు దుర్వినియోగమవుతోంది. దేశాన్ని శాశ్వతంగా గందరగోళ పరిస్థితుల్లో ఉంచి తమ విజభన ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం చూస్తోందని సోనియాగాంధీ విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని వారిపై ప్రభుత్వ సంస్థలను అస్త్రాలుగా ప్రయోగిస్తోందన్నారు. కార్యకర్తలను బెదిరించి వారి గొంతుక నొక్కేస్తున్నారని, ముఖ్యంగా సామాజిక మాధ్యమంలో అబద్ధాలు, విష ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భయం, మోసం, బెదిరింపులు ప్రభుత్వం గరిష్ఠ పాలనకు మూల స్తంభాలుగా మారాయని దుయ్యబట్టారు. ఈ వ్యాసం స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌ మాధ్యమంగా రాహుల్‌గాంధీ పంచుకున్నారు. బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌ రగిల్చిన విద్వేష చిచ్చుకు ప్రతి భారతీయుడు మూల్యం చెల్లించుకుంటున్నాడు. భారతీయ వాస్తవ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వం.. అన్ని వర్గాలు ఐక్యంగా సంతోషంగా ఉండటం. దీని పరిరక్షణకు ప్రతిజ్ఞ చేద్దాం అని ఆయన ట్వీట్‌ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా సోనియాగాంధీ వ్యాసాన్ని తన మైక్రోబ్లాగింగ్‌ సైట్‌లో పంచుకున్నారు. బీజేపీ పాలనలో దేశంలో విద్వేషం, శత్రుత్వం రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img