నాది చేతులు జోడించే తత్వం కాదు… : రాహుల్‌ గాంధీ

    267

    చేతులు జోడించి, బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవడం కొందరికి చాలా సులువని, తన స్వభావం అలాంటిది కాదని, తనది పోరాట పంథా అని కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. భారతదేశ భావనకోసం తాను పోరాడతానని తెలిపారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలోని అన్ని వ్యవస్థలను తన స్వాధీనంలోకి తెచ్చుకుందని ఆరోపించారు. ఇక పోరాటం భారత దేశ రాజ్య నిర్మాణం, ప్రతిపక్షాల మధ్యేనని చెప్పారు. ఇటీవల గులాం నబీ ఆజాద్‌ వంటి నేతలు పార్టీని వీడుతుండటంపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, వారిపై ఒత్తిడి పెంచగలిగే శక్తిసామర్థ్యాలు కచ్చితంగా తన కన్నా బీజేపీకి ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. భారత్‌ జోడో యాత్ర సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యా కుమారిలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో కాంగ్రెస్‌ నేతలు బస చేసేందుకు దాదాపు 60 కంటెయినర్లను ఉపయోగిస్తున్నారు. ఇదిలావుండగా, గులాం నబీ ఆజాద్‌, జైవీర్‌ షేర్గిల్‌ ఇటీవల కాంగ్రెస్‌ నుంచి వైదొలగి, ఆ పార్టీని తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.