Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిబంధనల ఉల్లంఘన నిజమే

రిషికొండ తవ్వకాలపై హైకోర్టుకు కేంద్ర కమిటీ నివేదిక
కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశాలు
తదుపరి విచారణ 26వ తేదీకి వాయిదా

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విశాఖలోని రిషికొండపై నిబంధనల ఉల్లంఘన వాస్తవమేనని కేంద్ర కమిటీ తేల్చిచెప్పింది. రిషికొండలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ కట్టడాలు, తవ్వకాలపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన పార్టీకి చెందిన విశాఖ కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీని నియమించిన విషయం తెల్సిందే. ఈ బృందంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలలో అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు. ఈ బృందం గత నెల 13వ తేదీన రిషికొండకు వెళ్లి అక్కడ క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అధ్యయనం చేసింది. కొండపై నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న తవ్వకాలు, భవన నిర్మాణాలను పరిశీలించింది. కొండపై భవన నిర్మాణాలకు ఉన్న స్థల అనుమతి ఎంత? ఏ మేరకు కొండను తవ్వారు? గతంలో కొండ విస్తీర్ణమెంత? ప్రస్తుతం తవ్వకాలు పూర్తయిన తర్వాత దాని విస్తీర్ణమెంత ఉంది. రిషికొండపై నిర్మాణాలకు ఇచ్చిన అనుమతుల్లో పారదర్శకత తదితర అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్ర కమిటీ బృందం పూర్తి వివరాలతో హైకోర్టుకు నివేదించింది. దీనిపై బుధవారం విచారించిన హైకోర్టు ఎదుట పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారు. కేంద్ర కమిటీ అందజేసిన నివేదికపై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్లను కోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img