Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిర్బంధ హిందీ అమలు చేస్తే దేశం మూడు ముక్కలవుతుంది

తమిళనాడు సీఎం స్టాలిన్‌
ఇంగ్లీష్‌ని తొలగించి హిందీకి పట్టం కట్టేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మండిపడ్డారు. హిందీని నిర్బంధంగా అమలు చేయాలనుకుంటే దేశం మూడు ముక్కలవుతుందని అన్నారు. హిందీ నిర్బంధ అమలును వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ… కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక నివేదికను అందజేసిందని.. ఆ నివేదికలో ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో హిందీ శిక్షణా భాషగా ఉండాలని సిఫారసు చేసినట్టు తెలిసిందని చెప్పారు. ఇంగ్లీష్‌ కు బదులుగా హిందీలో శిక్షణ జరగాలని ప్రతిపాదించినట్టు వెల్లడయిందని అన్నారు. ఒకే దేశం, ఒకే భాష నినాదంతో ఇతర భాషలను అణచివేసేందుకు కేంద్రం యత్నిస్తోందని స్టాలిన్‌ విమర్శించారు. ఆంగ్ల భాషను పూర్తిగా తొలగించే దిశగా అడుగులు వేస్తోందని అన్నారు. వాస్తవానికి హిందీని నిర్బంధంగా అమలు చేసే ప్రయత్నాలు 1938 నుంచే జరుగుతున్నాయని… ఆ ప్రయత్నాలను తాము అడ్డుకుంటూ వస్తున్నామని చెప్పారు. తమిళ భాష, సంస్కృతిని కాపాడుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అన్నారు. మరోవైపు హిందీకి వ్యతిరేకంగా సభలో స్టాలిన్‌ ప్రవేశ పెట్టిన తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు సమావేశాలను బహిష్కరించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img