Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిర్లక్ష్యం ఖరీదు రూ. 4.6 లక్షల కోట్లు

. నత్తనడకన కేంద్రం ప్రాజెక్టులు
. 20 ఏళ్లలో రికార్డు స్థాయిలో ఆలస్యం
. కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ : కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రాజెక్టులన్నీ పడకేశాయి. ప్రాజెక్టుల పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. గత 20 ఏళ్లలో ఎన్నడూలేనంత నెమ్మదిగా ప్రాజెక్టుల పనులు సాగుతున్నాయి. కేంద్రం చేపట్టిన ప్రాజెక్టులలో 56.3 శాతం ప్రాజెక్టులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఈ జాప్యం కారణంగా ప్రాజెక్టుల అంచనా వ్యయం 22.02 శాతం పెరిగిందని ఆ నివేదిక వెల్లడిరచింది. చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం ఖరీదు 4.6 లక్షల కోట్ల రూపాయలుగా తెలిపింది. లక్షల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అనుకొన్న సమయంలో పూర్తిచేయటంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఏప్రిల్‌ నెల నివేదికలో ప్రకటించింది. మోదీ సర్కారు చేపట్టిన రూ.250 కోట్లకు మించి విలువైన ప్రాజెక్టుల్లో ఏకంగా 56.2 శాతం ప్రాజెక్టుల్లో ఆలస్యంగా పనులు కొనసాగుతున్నట్టు తెలిపింది. గత 20 ఏళ్లలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం, ఆలస్యం ఎన్నడూ చోటుచేసుకోలేదని స్పష్టంచేసింది. మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో ఏకంగా 717 ప్రాజెక్టులు నత్తతో పోటీపడి నడుస్తున్నాయని నివేదిక వెల్లడిరచింది.
పనులు ఎక్కడివక్కడే ఆగిపోవటంతో వాటి అంచనా వ్యయం అమాంతం పెరిగిపోయి తడిసి మోపెడవుతున్నది. మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించినప్పుడు మొత్తం అంచనా వ్యయం రూ.3.97 లక్షల కోట్లు. ప్రస్తుతం అది రూ.4.60 లక్షల కోట్లకు పెరిగిందని నివేదిక వివరించింది. రైల్వేశాఖ చేపట్టిన 173 ప్రాజెక్టుల్లో ఏకంగా 114 ప్రాజెక్టుల పనులు అతి నెమ్మదిగా జరుగుతున్నాయి. దీంతో వీటి అంచనా వ్యయం ఏకంగా 68.1 శాతం పెరిగిపోయింది. ఆ తరువాత స్థానంలో పెట్రోలియం శాఖ ఉంది. పెట్రోలియం శాఖ ప్రాజెక్టుల్లో 86 పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వాటిలో రూ.150 కోట్ల అంచనా వ్యయానికి మించిన ప్రాజెక్టులు 1,418 ఉన్నాయి. అందులో ఆలస్యంగా సాగుతున్న ప్రాజెక్టులు 717. ఆలస్యంగా సాగుతున్న రైల్వే ప్రాజెక్టులు 114, ఆలస్యంగా సాగుతున్న పెట్రోలియం ప్రాజెక్టులు 86. ప్రాజెక్టులు అంచనా వ్యయం ఇప్పటికే చాలా పెరిగిపోయింది. పూర్తి అయ్యేనాటికి ఎన్ని రెట్లు పెరుగుతుందో అంచనావేయడం కష్టమని ఆ నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img