Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నిర్వాసితులకు తీవ్ర అన్యాయం

. చట్ట ప్రకారం పరిహారం అందజేయాలి
. న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం: రామకృష్ణ
. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టును పరిశీలించిన సీపీఐ బృందం

విశాలాంధ్ర`పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు వద్ద నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు ప్రాజెక్టుకు సంబంధించి భూములు కోల్పోయిన నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, 2013 చట్టం ప్రకారం నిర్వాసితులందరికీ నష్టపరిహారం అందజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా రామకృష్ణ నాయకత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు ప్రాజెక్టు పనులను మంగళవారం పరిశీలించింది. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల స్థితిగతులు పరిశీలించేందుకు సీపీఐ బృందం పర్యటిస్తోందని, ఇప్పటికే రాయలసీమ, ప్రకాశం జిల్లాలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పరిశీలించామని చెప్పారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాజెక్టులు సందర్శిస్తున్నామన్నారు. మహేంద్రతనయ నదిపై నిర్మిస్తున్న ఆఫ్‌షోర్‌ రిజర్వాయరు ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. 2008 ఏప్రిల్‌ 4న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆఫ్‌షోర్‌కు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు అందజేసిన నష్టపరిహారం చాలదని, 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వామైనా నిర్వాసితులందరికీ ఒకే రీతిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ తరపున డిమాండ్‌ చేస్తున్నామని రామకృష్ణ చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి ఇంటికీ ప్యాకేజీ కింద రూ.12.50 లక్షలు ఇస్తున్నారని, అయితే నిర్వాసితులు రూ.18 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. ఆఫ్‌షోర్‌లో భూములు కోల్పోతున్న చీపురుపల్లి రైతుల తరపున సర్పంచ్‌ ఈశ్వరరావు కేవలం 5 లక్షల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్లు తన దృష్టికి తీసుకొచ్చారని, అలా కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా నిర్వాసితులందరికీ ఒకే రీతిలో ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. అన్ని ప్రాజెక్టులు సందర్శించిన తర్వాత విజయవాడలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తామని, అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, సాగునీటిరంగ నిపుణులను ఆహ్వానించి ఈ సమస్యలన్నింటిపై చర్చిస్తామని, చివరిగా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని రామకృష్ణ వివరించారు. త్వరలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నందున నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తామన్నారు. చిన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఆఫ్‌షోర్‌ శంకుస్థాపన చేసిన రోజున నాటి సీఎం రాజశేఖరరెడ్డి ఏడాదిలో అంటే 2009లో ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ 15 సంవత్సరాలు దాటినా ఆ ప్రాజెక్టుకు అతీగతీ లేదని రామకృష్ణ విమర్శించారు. స్వల్పంగా ప్రాజెక్టు పనులు చేపట్టినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదని, 3 కోట్ల రూపాయలు బకాయి ఉన్నట్లు ఓ సబ్‌కాంట్రాక్టరు చెప్పారన్నారు. బిల్లులు రాకపోవడంతో వర్మ అనే మరో కాంట్రాక్టరు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పనులు చేసే వారికి డబ్బులు ఇవ్వకుండా, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. పాలకులు వస్తున్నారు…పోతున్నారు గానీ సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 15 సంవత్సరాలైనా అతి చిన్న ప్రాజెక్టు ఆఫ్‌షోర్‌ పూర్తికాకపోవడం సిగ్గుచేటన్నారు. అన్ని ప్రభుత్వాలు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించాయని, అందుకే ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సమస్యను ఒక ప్రధాన సమస్యగా సీపీఐ భావిస్తూ రాష్ట్రమంతా పర్యటిస్తున్నామని తెలిపారు. అందరి సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఆఫ్‌షోర్‌ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా ఉంటుందని, ఇందుకోసం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తిని కేటాయిస్తున్నామన్నారు. ఆయనకు తోడుగా సీపీఐ జిల్లా కార్యదర్శి శ్రీరామ్మూర్తి, నాయకులు సుందరలాల్‌, రమణ పోరాడతారని చెప్పారు.
జేవీ సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ నిర్వాసితుల కోసం సీపీఐ నిరంతరం పోరాడుతోందని చెప్పారు. బాధితులకు పునరావాసం, పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలని, కానీ ప్రభుత్వాలు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వలస కార్మికుల పేర్లను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. తాతతండ్రుల నుంచి వస్తున్న భూములు కోల్పోతున్న బాధితులకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం భూములు కోల్పోతున్న రేగులపాడు, చీపురుపల్లి నిర్వాసితులతో సమావేశమై వారి ఆవేదనను తెలుసుకున్నారు. ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనుల జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి నిర్వాహకులు విజయకుమార్‌ను నష్టపరిహారం చెల్లించే వరకు పనులు నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, అక్కినేని వనజ, జి.ఈశ్వరయ్య, డేగా ప్రభాకర్‌, రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ పి.కామేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ.విమలతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి బలగ శ్రీరామ్మూర్తి, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చాపర సుందరలాల్‌, జిల్లా నాయకులు చాపర వెంకటరమణ, పలాస నియోజకవర్గ కార్యదర్శి చాపర వేణుగోపాల్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాన షన్ముఖరావు, డీహెచ్‌పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యడ్ల మురళి, కె.శ్రీనివాసరావు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు సీహెచ్‌ రవి, సీపీిఐ విశాఖ జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సత్యనారాయణ, జిల్లా సమితి సభ్యులు నిమ్మాడ కృష్ణమూర్తి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారులు చిక్కాల గోవిందరావు, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు పి.ప్రభావతి, అరేళ్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img