Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నివురుగప్పిన నిప్పులా మణిపూర్‌

. హింసాకాండలో 54 మంది మృతి
. అనధికారికంగా ఈ సంఖ్య చాలా ఎక్కువ
. సాధారణ స్థితికి ఇంఫాల్‌ లోయ
. మేఘాలయకు పాకిన అల్లర్లు

ఇంఫాల్‌: ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్‌లో పరిస్థితి ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. భద్రతా సిబ్బంది పహారాలో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. శనివారం ఉదయం మార్కెట్లు, దుకాణాలు తెరిచినప్పటికీ పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగానే ఉంది. అయితే రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 54కు చేరిందని అధికారులు వెల్లడిరచారు. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ 54 మృతదేహాలను చురాచాంద్‌పుర్‌, ఇంఫాల్‌ ఈస్ట్‌ జిల్లా, ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లాల్లోని మార్చురీల్లో భద్రపరిచారు. ఘర్షణల్లో 150 మందికి పైగా గాయ పడ్డారు. మరిన్ని కేంద్ర పోలీసు బలగాలను మోహరిం చడం ద్వారా బలోపేతం చేయబడిన భద్రతా ఉనికి అన్ని ప్రధాన రహదారులు, ప్రాంతాలలో స్పష్టంగా కనిపిం చింది. శుక్రవారం భద్రతా బలగాలు తీవ్రవాద గ్రూపులు నిమగ్నమైన ప్రాంతాల్లో దిగ్బంధనాలు, కార్డన్‌లు ఏర్పాటు చేశారు. ఇక ఘర్షణలతో అట్టడుకుతున్న రాష్ట్రం నుంచి బయటపడేందుకు ఇంఫాల్‌ విమానాశ్రయంలో విద్యార్థులతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఇదిలా ఉండగా, కోహిమాకు తిరిగి వెళ్లేందుకు ఆదివారం ఇంఫాల్‌లోని నాగా విద్యార్థులందరినీ ఆయా ప్రాంతాల నుంచి తరలించవలసిందిగా అస్సాం రైఫిల్స్‌ దళానికి సూచించడం జరిగింది. బుధవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో బాధితుల కోసం ఏర్పాటు చేసిన వివిధ శరణార్థి శిబిరాల్లో ప్రాణాలతో బయటపడినవారు అనేక గ్రామాలు అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. మెజారిటీ మైతేయి సామాజిక వర్గానికి షెడ్యూల్డ్‌ తెగ హోదాను కల్పించే చర్యకు వ్యతిరేకంగా బుధవారం కుకీలు, నాగాలతో సహా గిరిజనులు నిర్వహించిన ప్రదర్శనల తర్వాత అల్లర్లు చెలరేగిన రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది సైన్యం, సాయుధ, కేంద్ర పోలీసు బలగాలను మోహరించారు. మైతేయి జనాభాలో దాదాపు 53 శాతంగా ఉండగా, వారు ఇంఫాల్‌ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. నాగాలు, కుకీలను కలిగి ఉన్న గిరిజనులు, జనాభాలో మరో 40 శాతం మంది ఉన్నారు. లోయ చుట్టూ ఉన్న పర్వత జిల్లాల్లో ఎక్కువగా నివసిస్తున్నారు. కాగా మరణించిన 54 మందిలో 16 మృతదేహాలను చురచంద్‌పూర్‌ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచగా, 15 మృతదేహాలు ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని లాంఫెల్‌లోని రీజినల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ 23 మంది మరణించినట్లు నివేదించిందని అధికారులు తెలిపారు. అయితే శుక్రవారం రాత్రి చురచంద్‌పూర్‌ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు కొండ ఆధారిత ఉగ్రవాదులు హతమయ్యారని, ఇద్దరు ఇండియా రిజర్వ్‌ బెటాలియన్‌ జవాన్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. చురచంద్‌పూర్‌ జిల్లాలోని సైటన్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు వారు వివరించారు. ఉగ్రవాదులు టోర్బంగ్‌ వద్ద భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఇద్దరు ఐఆర్‌బీ జవాన్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. చురచంద్‌పూర్‌, మోరే, కక్చింగ్‌, కాంగ్‌పోక్పీ జిల్లాలను సైన్యం తన ‘దృఢ నియంత్రణ’ లోకి తీసుకురావడంతో మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ఆశ్రయాలకు తరలించామని, కొంతమంది సైనిక శిబిరాల్లో ఉన్నారని రక్షణ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘గత 12 గంటల్లో ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ జిల్లాలు చెదురుమదురు కాల్పుల సంఘటనలు, దిగ్బంధనాలు, దహనకాండకు వ్యతిరేక శక్తులు ప్రయత్నించాయి. అయినప్పటికీ, దృఢమైన, సమన్వయ ప్రతిస్పందన ద్వారా పరిస్థితి నియంత్రించబడిరది’ అని రక్షణ శాఖ అధికారి శుక్రవారం రాత్రి చెప్పారు. మృతదేహాలను ఇంఫాల్‌ తూర్పు, పశ్చిమ, చురచంద్‌పూర్‌, బిషెన్‌పూర్‌ వంటి జిల్లాల నుంచి తీసుకువచ్చారు. తూటా గాయాలతో చాలా మంది రిమ్స్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కూడా చికిత్స పొందుతున్నారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్రం అదనపు భద్రతా బలగాలు, అల్లర్ల నిరోధక వాహనాలను పంపినప్పటికీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శుక్రవారం ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌, ఉన్నతాధికారులతో మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు. అల్లర్ల నిరోధక వాహనాలతో దాదాపు 1,000 మంది కేంద్ర పారామిలటరీ సిబ్బంది శుక్రవారం మణిపూర్‌ చేరుకున్నారని ఆ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుతం హింసాత్మక పరిస్థితుల కారనంగా మణిపూర్‌కు రైళ్లను తక్షణమే రద్దు చేసినట్లు ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వే (ఎన్‌ఎఫ్‌ఆర్‌) ప్రతినిధి తెలిపారు. షెడ్యూల్డ్‌ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతేయిల డిమాండ్‌ను నిరసిస్తూ ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్‌ యూనియన్‌ మణిపూర్‌ (ఏటీఎస్‌యూఎం) బుధవారం నిర్వహించిన ‘గిరిజన సంఫీుభావ యాత్ర’ సందర్భంగా చురచంద్‌పూర్‌ జిల్లాలోని టోర్‌బంగ్‌ ప్రాంతంలో హింస చెలరేగింది. మైతేయి సామాజిక వర్గం చేస్తున్న ఎస్టీ హోదా డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్రానికి సిఫారసు పంపాలని మణిపూర్‌ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో గిరిజనులు ప్రదర్శన నిర్వహించారు. టోర్బంగ్‌లో ప్రదర్శన సందర్భంగా సాయుధ గుంపు మెయిటీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులపై దాడి చేసిందని, ఇది లోయ జిల్లాల్లో ప్రతీకార దాడులకు దారితీసిందని, ఇది రాష్ట్రవ్యాప్తంగా హింసను పెంచిందని పోలీసులు తెలిపారు. కుకి, మైతేయి వర్గాల మధ్య మొదలైన ఘర్షణ ఇప్పుడు మేఘాలయకు పాకింది. ఇప్పటికీ ఆ రాష్ఠ్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అల్లర్లపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు మొబైల్‌ ఇంటర్‌నెట్‌ సేవలను కూడా నిలిపివేశారు. ఇదిలాఉండగా, మణిపూర్‌లో పరీక్ష కేంద్రాలను కేటాయించిన అభ్యర్థులకు నీట్‌ యూజీ`2023 పరీక్ష వాయిదా పడిరది. ఆదివారం జరగలవసిన ఆ పరీక్షకు మరొక తేదీని ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img