Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నిషేధిత భూముల సమస్యలకు చెక్‌పెట్టాల్సిందే

యేటా వారంపాటు భూ రికార్డుల అప్‌డేషన్‌
ఎప్పటికప్పుడు క్రయవిక్రయాల సమగ్ర డేటా
2023 మార్చి నాటికి భూ సర్వే పూర్తి
సమీక్షా సమావేశంలో సీఎం జగన్‌ ఆదేశాలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : నిషేధిత భూములు(22ఏ)కి సంబంధించిన సమస్యలకు స్వస్తి చెప్పడా నికి అవసరమైన విధానం తీసుకురావా లని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు. ఏ విధమైన తప్పిదాలు, పొరపాట్లు, ఉద్దేశపూర్వక చర్యలు పునరా వృతం కాకుండా చూడాలని, ఇందుకోసం తగినన్ని మార్గదర్శకాలు పటిష్ఠంగా రూపొందించాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత భూములకు సంబంధించి రికార్డుల్లో చోటుచేసుకున్న అక్రమాలను సీఎం గుర్తు చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా 22ఏ భూముల జాబితా నుంచి తొలగించాలన్నా, చేర్చాలన్నా లోపాల్లేని విధానాన్ని తీసుకురావాలని సూచించారు. దీనికి సంబంధించి అధీకృత వ్యవస్థను బలోపేతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు`భూ రక్ష పథకంపై గురువారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. అధికారులు తొలుత సమగ్ర భూ సర్వే పనుల్లో ప్రగతిని, లక్ష్యాలను వివరించారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన 51 గ్రామాల్లో సర్వే పూర్తి అయిందని, డిసెంబరు నాటికి మరో 650 గ్రామాల్లో పూర్తి అవుతుందని తెలిపారు. 2022 జూన్‌ 22నాటికి 2400 గ్రామాల్లో సర్వే పూర్తిచేస్తామని, మరో 2400 గ్రామాల్లో ఆగస్టు నాటికి, 2023 మార్చి నాటికి సర్వే మొత్తం పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న లక్ష్యం ప్రకారం సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూముల క్రయవిక్రయాలు జరిగినప్పుడు పట్టాదారు పుస్తకానికి సంబంధించి అమ్మిన వ్యక్తి, కొనుగోలు చేసిన వ్యక్తి రికార్డుల్లోనూ అప్‌డేట్‌ కావాలన్నారు. అప్పుడే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయినట్టుగా భావించాలన్నారు. గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూ సర్వేను పూర్తిచేయడానికి తగినంత సాంకేతిక పరికరాలను సమకూర్చుకోవాలని, డేటా భద్రతపై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, భూ రికార్డుల అప్‌డేషన్‌ను ఏటా ఒక వారంలో చేపట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్‌ (సర్వే, సెటిల్‌మెంట్స్‌) సిద్ధార్థ జైన్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కోన శశిధర్‌, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఎంఎం నాయక్‌, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఎండీ డాక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, ఏపీఎండీసీ వీసీ అండ్‌ ఎండీ వీజీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img