Friday, April 19, 2024
Friday, April 19, 2024

నీటి పారుదలకు మొండి చేయి

. వ్యవసాయశాఖకూ మొక్కుబడి నిధులు
. రూ.41436.29 కోట్లతో వ్యవసాయ, అనుబంధ బడ్జెట్‌
. వ్యవసాయశాఖకు రూ.12,369 కోట్లు
. జల వనరులశాఖకు రూ.11,908.10 కోట్లు
. పశు సంవర్థకశాఖకు రూ.111.23 కోట్లు
. మార్కెటింగ్‌ శాఖకు రూ.513.74 కోట్లు
. ఉద్యానవనం రూ.656.64 కోట్లు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 202324 వార్షిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన వ్యవసాయ, అనుబంధ రంగాల బడ్జెట్‌ నామ మాత్రపు కేటాయింపులతోనే సరిపెట్టింది. నీటి పారుదల శాఖ బడ్జెట్‌ రూ.11,908.10 కోట్లు (దాదాపు 5.25శాతం)నిధులతోనే సర్దుబాటు చేసింది. ఈ రంగానికి మొక్కుబడి నిధులతో మొండిచేయి చూపించింది. నామ మాత్రపు కేటాయింపులు, అంకెల గారడీతో బడ్జెట్‌ను ఆర్భాటంగా ప్రభుత్వం రూపొంచిందన్న విమర్శలున్నాయి. ఈ రంగానికి గతం కంటే…కేవలం రూ.500 కోట్లను అదనంగా చూపింది. అత్యంత ప్రాధాన్యత రంగమైన నీటి పారుదల రంగానికి బడ్జెట్‌లో 15శాతం నిధులు కేటాయించాలని సీపీఐఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమితి నేతృత్వంలో రాష్ట్ర నాయకత్వం బృందం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితిని అధ్యయనం చేసింది. అనంతరం వివిధ పార్టీలు, రైతు సంఘాల ప్రతినిధులతో విజయవాడ దాసరిభవన్‌లో రౌండుటేబుల్‌ సమావేశం తీర్మానించి...వాటిని ప్రభుత్వం దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రాలిచ్చినా ఫలితం లేకపోయింది 202324 వార్షిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్‌ను రూ.41436.29కోట్ల అంచనాలతో ప్రతిపాదిస్తూ…శాసన సభలో వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్‌రెడ్డి, శాసన మండలిలో పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు వేర్వేరుగా ప్రవేశపెట్టారు. మరో ఏడాదిలోగా సీఎం జగన్‌ ప్రభుత్వం పదవీ కాలం ముగియనుంది. ఈలోగా ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం కలిగించేలా ఈ బడ్జెట్‌లో ప్రతిపాదనలు లేవు. మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు గతంలో దాదాపు రూ.11వేలకుపైగా కోట్లు కేటాయించగా, దాంట్లో ఖర్చు చేసింది రూ.6,500 కోట్లు మాత్రమే. కేటాయింపులే అరకొర..దానికి తోడు ఖర్చునూ తక్కువుగానే చేపట్టారు. అటు వ్యవసాయ రంగంపై 65శాతం మంది ఆధారపడి ఉంటారు. ఈ రంగంపై ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయింపులూ నామ మాత్రమే. ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు కేటాయింపు ఏ మాత్రమూ చాలవు. కనీసం రూ.25వేల కోట్లు అయినా ఉండాలంటూ రైతు సంఘాల నేతల డిమాండ్‌ చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను నెలకొల్పేందుకు తగిన నిధులనూ పెట్టలేదు. ఏతావాతా బడ్జెట్‌లో వ్యవసాయ, ఇరిగేషన్‌ రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయాలని, ప్రాధాన్యత కలిగిన ఈ రెండు రంగాలకు నిధులు పెంచాల్సిన అవసరముంది. రాష్ట్రంలో కౌలు రైతులు నూటికి 70శాతం ఉండగా, వారికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపింది. పేద వర్గాల పక్షానే నేనుంటానంటూ సీఎం జగన్‌ చెప్పడమేనని…కౌలు రైతుల్లో అత్యధికం ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలే ఉంటారనీ, వారికే సరైన నిధుల సౌకర్యం కల్పించకుంటే ఏ విధంగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు న్యాయం చేసినట్లువుతుందని రైతు, కౌలు రైతు సంఘాల నేతలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఆర్బీకే మరింత పటిష్టవంతం: మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, సీదిరి అప్పలరాజు
ఈ బడ్జెట్‌లో ఆర్‌బీకేలకు శాశ్వత భవనాలు కల్పిస్తున్నామని, వాటిని మరింతగా పటిష్టం చేయనున్నామన్నారు. 8836 ఆర్బీకే భవనాలు వివిధ దశల్లో ఉంగా…వాటిని మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నామని, యూట్యూబ్‌ ఛానళ్లు, మాసపత్రికలను ప్రారంభించామని మంత్రులు కాకాని గోవర్థన్‌రెడ్డి, సీదిరి అప్పలరాజు బడ్జెట్‌ ప్రవేశపెడుతూ వెల్లడిరచారు. రెండేళ్లుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జాతీయభివృద్ధి రేటు కంటే…రాష్ట్రాభివృద్ధి రేటు అధికంగా ఉందని విశ్లేషించారు. 2021-22లో జాతీయ స్థాయిలో 10 శాతం వృద్ధికాగా, రాష్ట్రం 13.07 శాతం వృద్ధి సాధించిందన్నారు. 2022-23లో జాతీయ స్థాయిలో 11.2 శాతం వృద్ధి నమోదవ్వగా, రాష్ట్ర వృద్ధి రేటు 13.18 శాతంగా నమోదైనట్లు వివరించారు. 44 నెలల్లో రాష్ట్రంలో వ్యవసాయానుబంధ రంగాలకు రూ.లక్షా54వేల కోట్లు ఖర్చు చేసినట్లు, వ్యవసాయ విద్యుత్‌తో పగటి పూట 9గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంతో వ్యవసాయరంగానికి ఊతమిచ్చినట్లయిందన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రాన్ని కర్షక దేవాలయాలుగా తీర్చిదిద్దీ విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులకు సేవలందిస్తున్నారని చెప్పారు. 2022-23కుగాను మన దేశం తరుపున ఎఫ్‌ఏవో చాంఫియన్‌ అవార్డుకు రైతు భరోసా కేంద్రాలు ఎంపికయ్యాయని, ఈ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేయటానికి 2023-24 బడ్జెట్‌లో రూ.41.55 కోట్లు ప్రతిపాదించామన్నారు. ఆర్బేకేల్లో 50వేల టన్నుల ఎరువులను నిల్వ చేస్తున్నామన్నారు. వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేశామని, పంటల ప్రణాళిక, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాల పర్యవేక్ష చేపడుతున్నామని వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో రైతులు ఎక్కడా కరవు, కాటకాలను ఎదుర్కోలేదని, వారికి వాటర్‌ గన్‌ల అవసరమే రాలేదని, వర్షాలు సమృద్ధిగా కురిశాయన్నారు. రూ.6.01 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేశామని, 9లక్షల మంది కౌలు రైతులకు లబ్ది చేకూరిందన్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు చేసిందని, 3.50లక్షల మంది సన్నకారు రైతులకు సబ్సిడీపై స్ప్రేయర్లు, డ్రోన్ల ద్వారా పురుగుల మందు పిచికారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ద్వారా 10వేల డ్రోన్లను రైతులకు అందజేస్తామని, ఆర్బీకేల ద్వారా ఇప్పటివరకు 6940 కోట్లు కేటాయింపులు చేపట్టామన్నారు. ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా లక్షా 61వేల మంది రైతులకు లబ్ది చేకూరుస్తున్నామని, మార్కెటింగ్‌ శాఖాభివృద్ధికి రూ.513.74 కోట్లు కేటాయించామని వివరించారు.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయింపులివీ…
. వ్యవసాయశాఖకు రూ.12,369.59 కోట్లు
. ఉద్యాన రైతుల అభివృద్ధికి రూ.656.64 కోట్లు
. పట్టు పరిశ్రమ విభాగానికి మొత్తం రూ.99.72 కోట్లు
. మార్కెటింగ్‌ శాఖకు రూ.513.74 కోట్లు
. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.286.41 కోట్లు
. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.472.57 కోట్లు
. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం రూ.102.04 కోట్లు.
. శ్రీవెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం రూ.138.50 కోట్లు
. ఏపీ మత్స్య విశ్వవిద్యాలయానికి రూ.27.45 కోట్లు
. పశు సంవర్థకశాఖకు రూ.1114.23 కోట్లు
. మత్స్యశాఖ అభివృద్ధికి రూ. 500.83 కోట్లు
. వ్యవసాయ, విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.5500 కోట్లు
. ఉపాధి హామీ పథకం, వ్యవసాయ అనుసంధానంతో మొత్తం రూ.5100 కోట్లు
. వైఎస్‌ఆర్‌ జల కళ అమలుకు రూ.253 కోట్లు.
. నీటి పారుదల శాఖ బడ్జెట్‌ రూ.11,908.10 కోట్లు
. ఆర్బీకేలను మరింత బలోపేతం చేసేందుకుగాను ఈ బడ్జెట్‌లో రూ.41.55 కోట్లు ప్రతిపాదించారు.
. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం అమలుకు రూ.1600 కోట్లు
. రైతులకు ఆర్థిక ఆర్థిక వెసులుబాటు కల్పించే పథకం కోసం రూ.500 కోట్లు
. రాయితీ విత్తనాల సరఫరా కోసం రూ.200 కోట్లు
. ప్రకృతి విపత్తుల సహాయ నిధి కింద రూ.2వేల కోట్లు
. ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌ కోసం రూ.37.39కోట్లు
. రైతుల ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20కోట్లు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img