Friday, April 19, 2024
Friday, April 19, 2024

నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ నిలిపివేత

రిజర్వేషన్లు తేలాల్సిందే : సుప్రీంకోర్టు

న్యూదిల్లీ : రిజర్వేషన్ల వివాదం పరిష్కారమయ్యేంత వరకు నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్ల విద్యార్థులు నష్టపోతారని స్పష్టంచేసింది. ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే వరకు నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌ను ప్రారంభించబోమని కేంద్ర ప్రభుత్వం సైతం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. నీట్‌ పీజీ కౌన్సెలింగ్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. రిజర్వేషన్లకు సంబంధించిన నిర్ణయంపై తేలకుండా కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తే ‘విద్యార్థులు తీవ్ర సమస్యలో పడతారు’ అని ధర్మాసనం అభిప్రాయపడిరది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి నీట్‌ పీజీ ఆల్‌ఇండియా కోటాలో ఓబీసీలకు 27శాతం, ఆర్థికంగా వెనుకబడిన వర్గా(ఈడబ్ల్యూఎస్‌)లకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జులై 29న మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ నోటిషికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొంతమంది నీట్‌ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీజీ మెడికల్‌ కోర్సుల్లో రిజర్వేషన్ల విషయమై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా నీట్‌ పీజీలో రిజర్వేషన్లు కేటాయించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండగా..ఈ నెల 25 నుంచి నీట్‌ పీజీ కౌనెల్సింగ్‌ను కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రిజర్వేషన్ల చెల్లుబాటుపై నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మేరకు కేంద్రం కౌన్సెలింగ్‌ను నిలిపివేయనున్నట్లు కోర్టుకు హామీ ఇచ్చింది. విద్యార్థుల తరపున సీనియర్‌ న్యాయవాది అరవింద్‌ దాతార్‌ వాదనలు వినిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img