Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నెలాఖరులోగా బకాయిల చెల్లింపు

. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ
. ఉద్యోగులందరికీ రూ.3 వేల కోట్లు చెల్లిస్తాం
. ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి
. రాతపూర్వకంగా ఇవ్వాల్సిందే : బొప్పరాజు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంగళవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. దీనికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌ రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) చిరంజీవి చౌదరి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల తరపున రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి, రెవెన్యూ సర్వీసెస్‌ సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో వివిధ కీలక అంశాలపై చర్చించారు. ఈ నెలాఖరులోగా అన్ని విభాగాల ఉద్యోగస్తులకు సంబంధించిన రూ.3 వేల కోట్ల బకాయిల చెల్లించాలని మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమేనని, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మంత్రివర్గ ఉప సంఘం స్పష్టం చేసింది.
దిగిరాకుంటే ఉద్యమం యథాతధం : బొప్పరాజు
ఉద్యోగుల బకాయిలపై ప్రభుత్వం రాత పూర్వకమైన ప్రకటన చేయాలని, లేకుంటే ఈనెల 9 నుంచి ఉద్యమం యథాతధంగా కొనసాగుతుందని, ఇవాళ్టి చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రుల కమిటీ సమావేశంలో ఆర్థిక పరమైన అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్‌ చేశామన్నారు. పీఆర్సీ బకాయిలతో పాటు ఇతర అన్ని ఆర్థిక పరమైన వివరాలు చెప్పాలని, చర్చల ఫలితాలపై అన్ని జిల్లాల నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని, ఉద్యోగులకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సీపీఎస్‌ అమలు చేయాలంటూ చాలా రోజులుగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం విదితమే. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. దీంతో ఈనెల 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్లు ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది.
ఉద్యోగులందరికీ బకాయిల చెల్లింపు : సజ్జల, ఆదిమూలపు సురేష్‌
ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను మార్చి 31లోగా చెల్లిస్తామని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘ సమావేశం అనంతరం మీడియాతో సజ్జల మాట్లాడుతూ మంత్రివర్గ ఉప సంఘంతో ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయని తెలిపారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగమని, ఉద్యోగుల సంక్షేమం కోసం ఎప్పటికప్పుడూ చర్చిస్తున్నామన్నారు. అందరి ఉద్యోగులకు సంబంధించిన దాదాపు రూ.3 వేల కోట్ల బకాయిలను నెలాఖరులోగా చెల్లించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించిందని పునరుద్ఘాటించారు.
మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ, మెడికల్‌ ఎరియర్స్‌ అన్నీ ఈనెలాఖరు నాటికి చెల్లిస్తామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img