Friday, April 19, 2024
Friday, April 19, 2024

నేటి చలో అసెంబ్లీ అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ అరెస్టులు

. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు: రామకృష్ణ
. ప్రజల గోడు వినాలి: శ్రీనివాసరావు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: జీవో నంబరు1 రద్దు చేయాలంటూ ఐక్య పోరాట వేదిక సోమవారం చలో అసెంబ్లీకి ఇచ్చిన పిలుపుపై జగన్‌ సర్కారు మరోసారి దుర్మార్గ చర్యలకు పాల్పడుతోంది. చలో అసెంబ్లీ పిలుపునకు తరలివస్తున్న వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఎక్కడిక్కడే ముందస్తు అరెస్టులు చేస్తోంది. ముఖ్యనేతలను గృహనిర్బంధం చేస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో1 జారీ చేయగా, దానిని వ్యతిరేకిస్తూ జీవో నంబరు1 ఐక్య పోరాట వేదిక చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. చలో అసెంబ్లీకి రానీయకుండా పోరాట వేదిక నాయకులు, వామపక్ష, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. చాలా జిల్లాల్లో ఇప్పటికే సీపీఐ జిల్లా కార్యదర్శులు, ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలో ఏపీ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, ఏలూరులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌, సీపీఐ కర్నూలు జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్యతో పాటు 30మందిని ఆదివారం ఆస్పరిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదోనిలో విజయనగర్‌ శాఖ కార్యదర్శి సుదర్శనం మరో నలుగురిని, ఆలూరులో మండల కార్యదర్శి రామాంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కార్యదర్శి సి.జాఫర్‌, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, విజయనగరం జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ తదితరులను పోలీసుల అక్రమంగా అరెస్టు చేశారు. తిరుపతి, కర్నూలు, గుంటూరు, కృష్ణ, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్‌ కోనసీమ, విజయనగరం తదితర జిల్లాల్లో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.
జీవో నంబర్‌ 1 రద్దు ఐక్య పోరాట వేదిక తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాల ద్వారా సీఎం జగన్‌ ప్రభుత్వం చేస్తున్న దుష్టయత్నాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. జీవో నంబర్‌ 1 రద్దు చేయాలని కోరుతూ చలో అసెంబ్లీకి బయలుదేరిన వామపక్ష పార్టీల, ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పాల్పడుతున్నారు. సీపీఐ, సీపీఎం వామపక్ష పార్టీల నాయకులకు, కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం, ముందస్తుగా అరెస్టులు చేశారన్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ఈనెల 20వ తేదీన జీవో నంబర్‌ 1 రద్దు కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని స్పష్టంచేశారు. శాంతియుత ప్రజా ఉద్యమాలను అణచివేసేందుకు జగన్‌ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
జీవో నంబరు`1కి వ్యతిరేకంగా చలోఅసెంబ్లీకి పిలుపునిచ్చిన పౌరహక్కుల సంఘాల నాయకులు ముప్పాళ్ల సుబ్బారావుతోపాటు వామపక్ష, ప్రజా సంఘాల కార్యకర్తల్ని హౌస్‌ అరెస్టు చేయడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు.
తమ న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోడానికి విజయవాడ బయలుదేరుతున్న కాటికాపర్లు, శ్మశాన కార్మికుల్ని కూడా అరెస్టు చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌ తిరువూరు పర్యటన సందర్భంగా ఎన్టీఆర్‌ జిల్లాల్లో అనేక మందిని అక్రమంగా
అరెస్టు చేశారని, చనిపోయిన బంధువుల్ని
పలకరించడానికి వెళ్తున్న వారిని కూడా అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక చర్యలకు స్వస్తి చెప్పి ప్రజల వాక్కును వినాలని సీపీఎం డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img