Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నేటి నుంచి జీ`20 సదస్సు

. సర్వాంగ సుందరం విశాఖ సాగరతీరం
. 150 మంది విదేశీ ప్రతినిధులు
. నేడు సీఎం జగన్‌ రాక

విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం: ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ పరుగులు పెడుతున్న వేళ జీ20 దేశాల ఐక్యత ప్రాధాన్యత సంతరించుకుంది. జీ20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కెనడా, చైనా, ఫ్రాన్స్‌, జర్మనీ, భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌, ఇండోనేసియా, ఇటలీ, జపాన్‌, రష్యా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్‌, దక్షిణ కొరియా, అమెరికా దేశాలు ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం ఈ 20 దేశాలే కలిగి ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య వ్యాపారాల్లో జీ-20 దేశాలు 70 శాతం తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ప్రపంచ ఆర్థిక సుస్థిరత, సంతులిత అభివృద్ధి సాధించేందుకు సభ్యదేశాల మధ్య సమన్వయం కల్పించేదుకే ఏటా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. 2023 సెప్టెంబర్‌లో జీ 20 సదస్సు దిల్లీలో జరుగుతుంది. దీనికి భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహిస్తారు. దీనికి ముందు దేశంలోని ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం నుంచి రెండు రోజులపాటు విశాఖలో జీ20 సదస్సు జరగనుంది. మూడు నెలలుగా రూ.150 కోట్లతో విశాఖ నగరాన్ని, ప్రత్యేకించి సాగర తీరాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. 20 దేశాల నుంచి 150 మంది ప్రతినిధులు విశాఖ వస్తున్నారు. ఇందుకోసం అధికారులు అకుంఠిత దీక్షతో శ్రమించారు. విశాఖ కీర్తిని మరింత పెంచేందుకు హంగులు, రంగులతో జీ20 వేడుకలకు ఆరుప్రాంతాల్లో వేదికలను ముస్తాబు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం సాయంత్రం విశాఖకు చేరుకుంటారు. 2500 మంది పోలీస్‌ అధికారులు, సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ వెల్లడిర చారు. పర్యాటకులకు మూడు రోజులపాటు సాగర తీరంలో ప్రవేశం లేదని అధికారులు స్పష్టంచేశారు.
రేపటి ఆర్థిక నగరాలే లక్ష్యం: ఆరోఖ్య రాజ్‌
రేపటి ఆర్థిక నగరాలే లక్ష్యంగా విశాఖలో జీ-20 సదస్సు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్య రాజ్‌ స్పష్టం చేశారు. ఈ నెల 28 నుంచి జరగనున్న సదస్సు విశేషాలు, ముఖ్యాంశాలను నగరంలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో మీడియాకు సోమవారం ఆయన వివరించారు. జీ-20 తొలి సదస్సు పూనెలో జరగ్గా రెండో సదస్సు విశాఖలో జరుగుతోందన్నారు. మొత్తం 8 సెషన్లల్లో తొలిరోజు నాలుగు, రెండో రోజు మిగతావి ఉంటాయన్నారు. 28న సీఎం జగన్‌ హాజరై ప్రతినిధులతో పరిచయం… అనంతరం గాలా డిన్నర్‌లో పాల్గొంటారన్నారు. సదస్సుకు జీ-20 దేశాల ప్రతినిధులతో పాటు మరికొన్ని ఆహ్వాన సంస్థలు, ఏడీబీ, వరల్డ్‌ బ్యాంక్‌కు సంబంధించిన 63 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకోగా ఇప్పటికే 57 మంది విశాఖ చేరుకున్నారన్నారు.
మౌలిక సదుపాయాల కల్పన కోసం…
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ 50 శాతం మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారని, దీనివల్ల 80 శాతం జీడీపీ సాధిస్తున్నామని, 2050 నాటికి పట్టణాల్లో 70 శాతం ప్రజలు నివసించే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆరోఖ్య రాజ్‌ తెలిపారు. అందువల్ల పట్టణవాసులకు మౌలిక సదుపాయాలు కల్పించడం, భవిష్యత్తులో ఇంకెన్ని పెట్టుబడులు అవసరం అనే అంశాలపై నిపుణులు తమ సలహాలు చెబుతారన్నారు. ఈ నెల 30న అతిథులతో పాటు కేంద్రం నుంచి మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సహా మరికొంతమంది ప్రతినిధులు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొరియా, సింగపూర్‌ వంటి దేశాల ప్రతినిధులు…తమవద్ద విజయవంతమైన ప్రాజెక్టుల గురించి చెబుతారన్నారు. ఆఖరి రోజున దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అధికారులు, విద్యార్థులు, వైస్‌ చాన్సలర్లు, ప్రిన్సిపాల్స్‌ తదితరులు విచ్చేసి విదేశీ ప్రతినిధులతో సహృద్భావ చర్చలు జరుపుతారని, అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుంటారని ఆరోఖ్యరాజ్‌ స్ఫష్టం చేశారు. రేపటి ఆర్థిక నగరాలు, ఆర్థికాభివృద్ధి, ఇంధన సామర్ధ్యం, కాలుష్య నియంత్రణ వంటి ఎన్నో విషయాలపై సుదీర్ఘ చర్చలుంటాయన్నారు. ఆర్థిక శాఖ నిపుణులు అమన్‌ గార్గ్‌, జితేంద్రసింగ్‌ రాజీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img