Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేటి నుంచి టీడీపీ మహానాడు

. స్వాగత ఏర్పాట్లతో రాజమహేంద్రవరం పసుపుమయం
. 30 ఏళ్ల తర్వాత రాజమండ్రిలో నిర్వహణ
. నేడు ప్రతినిధుల సభ`రేపు బహిరంగ సభ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మూడు దశాబ్దాల తర్వాత టీడీపీ పసుపు పండుగకు రాజమహేంద్రవరం మరోసారి వేదికవుతోంది. మహానాడుతో పాటు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలకు కూడా వేదిక కానుంది. రాజమహేంద్రవరానికి సమీపంలోని వేమగిరి గ్రామంలో ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న టీడీపీ మహానాడుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్లీనరీ, బహిరంగసభలకు ఈసారి వేర్వేరు చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు. పది ఎకరాల స్థలంలో ప్రతినిధుల సభ, 60 ఎకరాల విస్తీర్ణంలో 28న బహిరంగసభకు ఏర్పాట్లు చేపట్టారు. వాహనాల పార్కింగ్‌, భోజన ఏర్పాట్లకు మరో 140 ఎకరాల మేర కేటాయించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో సమావేశమయ్యే వీఐపీ లాంజ్‌తో పాటు ప్రతినిధులు సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు వీలుగా 50వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ షెడ్‌ నిర్మించారు. బహిరంగసభకు 15 లక్షల మంది పార్టీ శ్రేణులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దానికనుగుణంగా 20 లక్షల వాటర్‌ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. మహానాడులో మొత్తం 20 తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. వీటిలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై 14 తీర్మానాలుండగా, తెలంగాణ ప్రభుత్వ విధానాలపై 6 తీర్మానాలున్నాయి. రోడ్డుమార్గంలో శుక్రవారం సాయంత్రానికి రాజమహేంద్రవరం చేరుకున్న చంద్రబాబు…పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించి మహానాడులో పెట్టబోయే తీర్మానాలపై సమీక్షించారు. మహానాడు ఏర్పాట్లను టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, కంభంపాటి రామ్మోహన్‌ రావు, చింతకాయల విజయ్‌ తదితరులు మరోసారి పరిశీలించారు. మహానాడు వేదికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వారు మీడియాకు చెప్పారు. మొదటిసారి ప్రవేశద్వారం వద్ద క్యూఆర్‌ కోడ్‌ సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. ‘మహానాడు, ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు రెండిరటికీ రాజమహేంద్రవరం వేదిక కానుంది. 1993లో రాజమహేంద్రవరంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాం. 1994లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 30 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి రాజమహేంద్రవరంలోనే ఘనంగా మహానాడు నిర్వహించబోతున్నాం. 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. రాజమహేంద్రవరం ‘మహానాడు’తో రానున్న ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తాం’’ అని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. మహానాడులో టీడీపీ తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్నట్లు చెప్పారు. ఇందులో మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రయోజనం చేకూర్చే అంశాలను పొందుపరచనున్నట్లు వివరించారు. దసరాకు పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు వెల్లడిరచారు. సభాధ్యక్షత నిర్వహణ నుంచి ప్రసంగాలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం వరకు ఈసారి కొత్త వారికే అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఏర్పాటు చేసిన స్వాగత ద్వారాలు, ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కటౌట్లు, తోరణాలు, జెండాలతో రాజమహేంద్రవరం పసుపుమయంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img