Friday, April 19, 2024
Friday, April 19, 2024

నేడు బిల్కిస్‌, రేపు ఇంకెవరైనా…

11 మంది దోషులను ఏ కారణాలతో విడుదల చేశారు

. మేమే సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాం
. కేంద్రంపై సుప్రీంకోర్టు అసహనం

న్యూదిల్లీ: బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేయడానికి సంబంధించి పత్రాలను సమర్పించాలన్న కోర్టు ఆదేశాలను కేంద్రప్రభుత్వం సవాల్‌ చేసింది. ఆ మేరకు పత్రాలను సమర్పించాలని అనుకోవడం లేదని, అలా చేసేందుకు తమకు అవకాశం ఉన్నదని సర్వోన్నత న్యాయ స్థానానికి వెల్లడిరచింది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ నేడు బిల్కిస్‌, రేపు ఇంకెవరైనా కావచ్చు. మీరు, నేను కూడా కావచ్చు. ముందస్తు విడుదలకు కారణాలను మీరు చూపకపోతేగనుక అందుకు కారణాలు మేము ఏమైనా ఊహించుకోవచ్చు. సొంతంగా నిర్ణయాలనూ తీసుకోవచ్చు’ అంటూ కేంద్రంపై అసహనం వ్యక్తంచేసింది. ‘ఓ గర్భిణి సామూహిక అత్యాచారానికి గురైంది. అనేకమంది హత్యకు గురయ్యారు. ఐపీసీలోని 302 సెక్షన్‌ కింద నమోదైన కేసులతో బాధితురాలి కేసును పోల్చరాదు. కమలా పండుతో ఆపిల్‌ను పోల్చలేము. అలాగే మారణహోమాన్ని/ ఊచకోతను ఒకరి హత్యతో పోల్చలేము. సాధారణంగా నేరాలన్నవి వర్గానికి, సమాజానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయి. అసమానులను సమానంగా చూడరాదు. ఏ అంశాలను ఆధారంగా చేసుకొని 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేశారు? ఇలా చేసే ముందు ప్రభుత్వం బుర్రపెట్టి ఆలోచించిందా? వివేకంగా వ్యవహరించిందా? నేడు బిల్కిస్‌, రేపు ఇంకెవరైనా కావచ్చు. మీరు నేను కూడా కావచ్చు. ముందస్తు విడుదలకు కారణాలను మీరు చూపకపోతేగనుక అందుకు కారణాలు మేము ఏమైనా ఊహించుకోవచ్చు’ అని జస్టిస్‌ కేఎం జోసఫ్‌, జస్టిస్‌ బీవీ నగరత్న ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్‌ జోసఫ్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం వివేకాన్ని ఉపయోగించిందా? అనేదే ప్రధాన ప్రశ్న అని అన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు. దోషులు తమ సహజ జీవితంలో మిగిలిన భాగమంతా జైలులోనే గడపాలని జ్యుడిషియల్‌ ఆర్డర్‌ చెప్తోందన్నారు. ఆ దోషులను కార్యనిర్వాహక శాఖ ఆదేశాలతో విడుదల చేశారన్నారు. మీరు కారణాలు చెప్పకపోతే, మేము మా సొంత నిర్ణయాలు తీసుకుంటామన్నారు. 2002 గుజరాత్‌ అల్లర్లలో బిల్కిస్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలో ఏడుగురు హత్యకు గురయ్యారు. ఈ కేసులో దోషులుగా తేలిన 11 మంది ముందస్తుగా విడుదల కావడాన్ని సవాల్‌ చేస్తూ గతేడాది నవంబరులో బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై గుజరాత్‌ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ వివరణ కోరుతూ మార్చి 27న సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. 11 మంది విడుదలకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని సూచించింది. వీరిని విడుదల చేసే ముందుకు జరిగిన నేరతీవ్రతను పరిగణనలోకి తీసుకొని ఉండాల్సిందని అభిప్రాయపడిరది. ఇదిలావుంటే మే 2వ తేదీన ఈ కేసులో దోషుల రెమిషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనున్నది. ఇప్పటికే దోషులకు నోటీసులు జారీ చేసి వారి స్పందనను కోరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img