Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నేతన్నల భారీ ర్యాలీ

ధర్మవరంలో పోలీసుల దౌర్జన్యం
తోపులాట… అరెస్టులు

విశాలాంధ్ర`ధర్మవరం:
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు కదం తొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని, పాలకుల నిర్లక్ష్యం సరికాదని నినదించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ వేలాదిమంది చేనేత కార్మికులు బుధవారం ధర్మవరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని గాంధీ విగ్రహం నుండి ఎన్టీఆర్‌, అంజుమాన్‌, కళా జ్యోతి సర్కిల్‌ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పాలకులు మారినా నేతన్నల బతుకులు మారడం లేదని నాయకులు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేత కార్మికుల జీవనంపై దెబ్బకొడుతూ మర మగ్గాలును ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు అధ్వర్యంలో జరిగిన ధర్నాలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌ మాట్లాడారు. చేనేత కార్మికుల అభివృద్ధిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేనేత కార్మికులను ఆకలి చావులు, ఆత్మహత్యల నుండి కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వేమయ్య చెప్పారు. తమ సమస్యలను ఎమ్మెల్యే కేతిరెడ్డికి, ఎంపీ గోరంట్ల మాధవ్‌కి, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని మండిపడ్డారు. మరమగ్గాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా అధికారులు, ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. చేనేత రిజర్వేషన్‌ చట్టాన్ని మరమగ్గాల యజమానులు ఉల్లంఘిస్తున్నారని, అందుకే చేనేతలు చీరలు విక్రయాలు జరగడం లేదన్నారు. మర మగ్గాలు పూర్తిగా తొలగిస్తామని ఆర్డీవో తిప్పే నాయక్‌ అధ్వర్యంలో హ్యాండ్లూమ్స్‌ అధికారులు చేనేత జౌళిశాఖ అధికారులు కార్మికుల సమక్షంలో హామీ ఇచ్చినా అమలు జరగలేదని విమర్శించారు. పవర్‌ లూమ్‌ యాజమాన్యంపై ఉన్న ప్రేమ, చేనేత కార్మికులపై ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చేనేత కార్మికులు మనుషులు కారా? డబ్బుంటేనే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం స్పందిస్తాయా అని దుయ్యబట్టారు. కాగా, చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు గంటలకొద్దీ రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. సమాచారం అందుకున్న వన్‌టౌ సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో ధర్నా వద్దకు చేరుకొని నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, నేత కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు బలప్రయోగానికి దిగారు.
నాయకులు, కార్యకర్తలను బలవంతంగా తమ వ్యాన్‌లలో పడేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి వెంకటస్వామి, వెంకట నారాయణ, సీపీఐ కార్యదర్శి రవి కుమార్‌, సహాయ కార్యదర్శి వై.రమణ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పోతులయ్య, కార్యవర్గసభ్యులు విజయభాస్కర్‌, గంగాధర్‌, శ్రీనివాసులు, లోకేశ్‌, వెంకట్‌, నారాయణ, శేఖర్‌, మంజు, గోవర్ధన్‌, చింతా శ్రీనివాసులు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్‌తో పాటు చేనేత కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img