Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంజాబ్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌

ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌
చండీగఢ్‌ : పంజాబ్‌ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్‌ మాన్‌ను పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం ప్రకటించారు. . ప్రజాభిప్రాయాన్ని బట్టి ఆయనను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఫోన్‌, వాట్సాప్‌ ద్వారా తెలియజేశారని, రెండు సార్లు సంగ్రూర్‌ నుంచి ఎంపీగా ఎన్నికయిన 48 ఏళ్ల భగవంత్‌ మాన్‌కు 93.3 శాతం మంది మద్దతు పలికారని చెప్పారు. భగవంత్‌ మాన్‌ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నాడు. కాగా అసెంబ్లీ ఎన్నికలకు తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోవాలనే ప్రచారంలో పార్టీకి 21.95 లక్షల స్పందనలు వచ్చాయని పార్టీ నాయకులు వివరించారు. ఇక్కడ విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ ‘21.45 లక్షల ఓట్లకుగాను అనేక మంది నా పేరును చేర్చారు. రేసులో లేనని నేను ముందే చెప్పాను. మేము ఆ ఓట్లు చెల్లవని(కేజ్రీవాల్‌ పేరు) ప్రకటించాం. మిగిలిన 93.3 శాతం మంది ప్రజలు సర్దార్‌ భగవంత్‌ మాన్‌ పేరును సూచించారు’ అని తెలిపారు. ఇదిలాఉండగా, పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూను ముఖ్యమంత్రిగా చూడాలని 3.6 శాతం మంది కోరుకున్నారని కేజ్రీవాల్‌ చెప్పారు. ‘ఆప్‌ సీఎం అభ్యర్థి, పంజాబ్‌ తదుపరి ముఖ్యమంత్రిగా భగవంత్‌ మాన్‌ను అధికారికంగా ధ్రువీకరిస్తున్నాం’ అని అన్నారు. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ గెలుస్తుందని స్పష్టమైపోయిందన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికైనవారే తదుపరి పంజాబ్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. తన పేరును ప్రకటించిన తర్వాత మాన్‌ భావోద్వేగానికి గురయ్యారు. హాస్యనటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన భగవంత్‌ మాన్‌ తల్లి, సోదరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భగవంత్‌ మాన్‌ 2014 మార్చిలో ఆప్‌లో చేరారు. 2014, 2019లలో సంగ్రూర్‌ నియోజక వర్గం నుంచి ఆప్‌ లోక్‌సభ సభ్యునిగా గెలిచారు. 2011లో పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ పంజాబ్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2012లో లెహ్రా నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. కాగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల్లో ఆప్‌ ఒక్కటే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. పంజాబ్‌కు చెందిన 117 అసెంబ్లీ సీట్లకు ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img