Friday, April 19, 2024
Friday, April 19, 2024

పంట పరిహారమేది?

అకాలవర్షాలకు 2లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఆపన్నహస్తం కోసం అన్నదాత ఎదురుచూపు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మార్చిలో కురిసిన అకాలవర్షాల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు సహాయం చేస్తున్నామని చెపుతున్న రాష్ట్ర ప్రభుత్వం… నెల దాటినా నష్టపరిహారం ఇవ్వలేదు. పరిహారం ఎప్పుడిస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. అధికార యంత్రాంగం సైతం సమాధానం చెప్పలేని స్థితిలో ఉంది. అకాల వర్షాల కారణంగా కృష్ణా, గుంటూరు, గోదావరి డెల్టా ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పంట దెబ్బతింది. కోతలు కోసిన పనలు నీటమునిగి మొలకలెత్తగా, కోతకు వచ్చిన వరి పనలు నేలకొరిగి నీట నానాయి. అప్పటికే కోసి కల్లాల్లో ఆరబెట్టిన వేలాది టన్నుల ధాన్యం తడిసిపోయింది. ధాన్యం కొనుగోలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో చాలావరకు ధాన్యం కల్లాల్లోనే ఉండిపోయింది. పక్వానికొచ్చిన మొక్కజొన్న పంట నేలకొరిగి నాశనమైంది. ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో మిరప పంట పెద్దమొత్తంలో దెబ్బతింది. అసలే అధిక పెట్టుబడితో కూడిన మిరప పంటకు ఈ ఏడాది తామరపురుగు సోకి నాశనం చేసింది. దీని నివారణ కోసం రైతులు సాధారణం కంటే రెట్టింపుస్థాయి పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఏ పురుగు మందు కొడితే ఈ వైరస్‌ నివారించబడుతుందో వ్యవసాయాధికారులు సైతం చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో దాదాపు అన్ని రకాల పురుగుమందులు పిచికారి చేసి ప్రయోగాలు చేశారు. ఫలితంగా పెట్టుబడులు తడిసి మోపెడయ్యాయి. వీటన్నింటినీ తట్టుకుని కొద్దోగొప్పో పండిన మిర్చి…ఈదురుగాలుల దాటికి తట్టుకోలేక నేల రాలింది. పూత, పిందె, కాయ రాలిపోయింది. అరటి, మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది అధిక మంచు కారణంగా మామిడి పూత రాలిపోయి దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీనికితోడు ఈదురుగాలులు, అకాలవర్షాలు తోడు కావడంతో మామిడి నష్టం అంచనాలకు అందనంతస్థాయిలో రైతును చావుదెబ్బతీసింది. అన్ని రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయి. కాగా, బాధితులకు నష్టపరిహారం తక్షణమే అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖ రాశారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న, రంగుమారిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, రబీ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. నష్టపోయిన వరి, మొక్కజొన్న రైతుకు ఎకరాకు రూ.20వేల చొప్పున పరిహారం అందజేయాలని, మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలని వారు డిమాండ్‌ చేశారు. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా పిడుగులు పడి రాష్ట్రవ్యాప్తంగా మృతి చెందిన ఏడు కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img