Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పట్టభద్రుల ఓటర్లుగా నిర్లక్ష్యరాస్యులు

. ఒక్క తిరుపతిలోనే 15వేల నకిలీ ఓట్లు
. ఎన్నికల పారదర్శకతకు హామీ ఇవ్వాలి
. నకిలీ ఓట్లు తక్షణమే తొలగించాలి
. సీఈసీకి సీపీఐ కార్యదర్శి నారాయణ లేఖ

న్యూదిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, తిరుపతిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల క్రమంలో 15వేల నకిలీ ఓటర్లు ఉన్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గుర్తించింది. ఇదే విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) దృష్టికి సీపీఐ కార్యదర్శి కె.నారాయణ తీసుకెళ్లారు. ఇందుకోసం ఆయన శనివారం ఓ లేఖ రాశారు. ఒక్క తిరుపతిలోనే పట్టభద్రులు కాని 15వేల నకిలీ ఓటర్లు నమోదై ఉన్నారని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని, వీరికి పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయనిస్తే ప్రజాస్వామ్యానికి నష్టం కలుగుతుందని లేఖలో నారాయణ పేర్కొన్నారు. ‘బుధవారం తిరుపతిలోని సుందరయ్యనగర్‌కు వెళ్లి అక్కడి ఓటర్ల జాబితాను పరిశీలించగా నకిలీ ఓటర్లు చాలామంది ఉన్నట్లు తెలిసింది. ఏదో విధంగా గెలవాలనే లక్ష్యంతో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ పోలింగ్‌ రోజు గందరగోళం సృష్టించే యత్నాలలో ఉంది. ఒక ఇంట్లో 13 నకిలీ ఓట్లను గుర్తించగా ఇంకో చోట ఇంటి నంబరు తప్పుగా ఉంది. ఆ చిరునామాలో ఖాళీ స్థలం, పది నకిలీ ఓట్లున్నాయి. చదవడం, రాయడం కూడా తెలియని నిరక్షరాస్యులకు పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లుగా నమోదు చేశారు. వార్డు వలంటీర్‌ ఇంట్లో పది నకిలీ ఓట్లు ఉంటే ఓ కార్మికుడి ఇంట్లో 12నకిలీ ఓట్లున్నాయి. సీపీఎం కార్యకర్త ఇంటినీ వారు వదల్లేదు. అక్కడ ఎనిమిది నకిలీ ఓట్లు నమోదై ఉన్నాయి’ అని నారాయణ పేర్కొన్నారు.
సీపీఐ ఏపీ కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బృందం ఆ జిల్లా కలెక్టర్‌ వెంకటరమణ రెడ్డిని కలిసి ఎన్నికల అధికారులను పారదర్శకంగా పని చేయనివ్వాలని కోరారు. వైఎస్‌ఆర్‌సీపీ మార్గదర్శకత్వంలో తిరుపతి పోలీసు అధికారులు పని చేస్తున్నారని ఆయన దృష్టికి నేతలు తీసుకెళ్లారు. పోలింగ్‌ పారదర్శకంగా జరగాలని, ఎటువంటి మోసాలకు అవకాశం ఇవ్వవద్దని విన్నవించారు. వేరే రాష్ట్ర పోలీసు అధికారుల పర్యవేక్షణలో పోలింగ్‌ శాంతియుతంగా జరిపించాలని విజ్ఞప్తి చేశారు. నకిలీ ఓటర్ల జాబితాను వారి ఓటర్ల జాబితాలోని సీరియల్‌ నంబర్లు, విద్యార్హతులతో పాటు స్థానిక సంబంధిత నాయకులకు వారు అందజేశారు. నమోదైన జాబితాలోని చిరునామాల్లో లేని నకిలీ ఓటర్ల గురించీ వివరాలను నేతలు అందజేశారు. నకిలీ ఓటర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు వేయనివ్వరాదు. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఓటర్ల జాబితాలోని 1 నుంచి 4 వరకు అనుబంధ పత్రాల్లో పేర్కొన్న నకిలీ ఓటర్ల తొలగింపునకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని సీఈసీకి రాసిన లేఖలో నారాయణ వెల్లడిరచారు. నకిలీఓటర్ల జాబితాను తన లేఖకు పొందుపర్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img