Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు – మాజీమంత్రి నారాయణ అరెస్టు

హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీఐడీ
రోడ్డుమార్గం ద్వారా చిత్తూరుకు తరలింపు
పక్కా ఆధారాలున్నాయన్న ఎస్‌పీ

విశాలాంధ్ర`హైదరాబాద్‌/చిత్తూరు: నారాయణ విద్యాసంస్థల అధిపతి, ఏపీ మాజీమంత్రి నారాయణను చిత్తూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నారాయణ దంపతులను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అరెస్టు చేసినట్టు చిత్తూరులో ఎస్‌పీ రిశాంత్‌ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్‌లో కారులో వెళ్తున్న నారాయణ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…వారి సొంత కారులోనే ఏపీకి తరలించారు. నారాయణపై పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ప్రాక్టీస్‌ చట్టంలోని సెక్షన్‌ 5, 8, 10, ఏపీ పబ్లిక్‌ ఎగ్జామ్స్‌ చట్టంతో పాటు 408, 409, 201, 120(బి), 65 ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. చిత్తూరు జ్యుడిషియల్‌ కోర్టులో నారాయణను పోలీసులు హాజరుపరిచారు. అనంతరం జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు. గతంలో ఎప్పుడూ లేనంతగా పదోతరగతి ప్రశ్నపత్రాలు వరుసగా లీకేజీకావడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది. తొలుత విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసలు ప్రశ్నపత్రాలే లీకవ్వలేదంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా తెలుగుదేశం చేస్తున్న విషప్రచారమంటూ మండిపడ్డారు. ఆ తర్వాత సీఎం జగన్‌ తిరుపతి బహిరంగ సభలో నారాయణ, చైతన్య విద్యాసంస్థల్లోనే ప్రశ్నపత్రాలు లీకైనట్లు వెల్లడిరచారు. ఈ నేపథ్యంలోనే నారాయణను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. పేపర్‌ లీకేజీ, మాల్‌ప్రాక్టీస్‌ కేసులో దాదాపు 50మందికి పైగానే ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం విశేషం. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి చిత్తూరు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో నారాయణ స్కూలు వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తోపాటు అనేకమందిని అరెస్టు చేశారు.
అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
నారాయణ అరెస్ట్‌ వ్యవహారంలో కొద్దిపాటి డ్రామా చోటుచేసుకుంది. నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాదులో అరెస్ట్‌ చేయడంతో ఆయన విద్యాసంస్థల సిబ్బంది తెలంగాణ పోలీసులను ఆశ్రయించారు. నారాయణ కిడ్నాప్‌కు గురయ్యారంటూ వ్యక్తిగత సహాయకులు రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. షాద్‌నగర్‌ కొత్తూరు సమీపంలో ఏపీ పోలీసులు ఉన్న వాహనాన్ని తెలంగాణ పోలీసులు ఆపేశారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో నారాయణను అదుపులోకి తీసుకున్నట్టు ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు వివరించారు. అనంతరం అక్కడి నుంచి నారాయణను చిత్తూరుకు తరలించారు.
పక్కా ఆధారాలతోనే అరెస్టు: చిత్తూరు ఎస్పీ
నారాయణ విద్యాసంస్థల చైర్‌పర్సన్‌ హోదాలోనే టీడీపీ నేత నారాయణను అరెస్ట్‌ చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్‌రెడ్డి వెల్లడిరచారు. విద్యాసంస్థల చైర్‌పర్సన్‌గా నారాయణ కొనసాగుతున్నారా? ఇప్పటికే తప్పుకున్నారా? అన్న దానిపై తదుపరి విచారణలో నిగ్గు తేలుస్తామని ఆయన తెలిపారు. నారాయణ అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను చిత్తూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ రిశాంత్‌ వెల్లడిరచారు. పదో తరగతి పరీక్షల్లో భాగంగా గత నెల 27న జరిగిన తెలుగు పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాన్ని ముందుగానే బయటకు తెచ్చిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు.. కాసేపట్లోనే ఆయా ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసి పరీక్షా కేంద్రానికి పంపే యత్నం చేశారని ఎస్పీ తెలిపారు. అయితే అప్పటికే తాము ఈ యత్నాన్ని అడ్డుకున్నామని చెప్పారు. తమ విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు మంచి మార్కులు రావాలన్న ఉద్దేశంతోనే నారాయణ విద్యాసంస్థలు ఈ కుట్రకు పాల్పడ్డాయని ఆయన వివరించారు. ఏప్రిల్‌ 27న చిత్తూరు వన్‌టౌన్‌ పీఎస్‌లో కేసు నమోదు కాగా…ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్‌ చేశామని, తాజాగా నారాయణతో పాటు చిత్తూరు డీన్‌ బాలగంగాధర్‌ను కూడా అరెస్ట్‌ చేశామన్నారు. అరెస్ట్‌ సందర్భంగా నారాయణ పోలీసులకు పూర్తిగా సహకరించారని ఎస్పీ తెలిపారు. ఆయన పారిపోయేందుకు యత్నించారన్న వార్తలపై స్పందిస్తూ… అలాంటిదేమీ లేదన్నారు. అంతేకాకుండా నారాయణను మాత్రమే తాము అరెస్ట్‌ చేశామని, నారాయణ భార్యను అరెస్ట్‌ చేయలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో పక్కా ఆధారాలు లభించడంతో నారాయణను అరెస్ట్‌ చేశామని ఎస్పీ తెలిపారు. ఆర్గనైజ్డ్‌ మెకానిజం (వ్యవస్థీకృత యంత్రాంగం) ద్వారా నారాయణ విద్యాసంస్థలు మాల్‌ప్రాక్టీస్‌కు గతంలో పాల్పడ్డాయని, అయితే ఈ దఫా తమ నిఘాతో వారి ఆటలు సాగలేదని తెలిపారు. ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఇతర విద్యాసంస్థలకు చెందిన వారి పాత్ర కూడా ఉందని, వారంతా గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసిన వారుగానే తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో నారాయణ తప్పు చేశారని తేలితే… పదేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img