Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పరిషత్‌ వైసీపీ పరం

13 జిల్లాల్లో ఫ్యాన్‌ జోరు

అత్యధిక జెడ్పీటీసీ, ఎంపీటీసీలు కైవసం
టీడీపీ కంచుకోటల్లోనూ ఘన విజయం
వైసీపీ శ్రేణుల సంబరాలు
జగన్‌ సంక్షేమ పాలనకు నిదర్శనమన్న నేతలు
ఇవి బోగస్‌ ఫలితాలుగా టీడీపీ ఎద్దేవా

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ దాదాపుగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం అధ్వర్యంలో ఆదివారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. ఈ ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు తిరుగులేని విజయం సాధించారు. అన్ని జిల్లాల్లోనూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ అభ్యర్థులు ముందంజలో నిలిచారు. టీడీపీ కంచుకోటగా భావించే నియోజకవర్గాలు, ప్రాంతాల్లోనూ వైసీపీకి చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గెలుపొందారు. ఫలితాల్లో టీడీపీ పూర్తి స్థాయిలో వెనుకబడిరది. ఈ ఫలితాలతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. జగన్‌ సంక్షేమ పాలనకు ఈ ఎన్నికలు నిదర్శమని ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. అటు టీడీపీ శ్రేణులు మాత్రం ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఇవి బోగస్‌ పరిషత్‌ ఫలితాలుగా అభివర్ణించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 206 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 42,360 మంది సిబ్బందిని కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం జెడ్పీటీసీ స్థానాలు 660 ఉండగా, అందులో నోటిఫికేషన్‌ జారీ సమయంలో 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయగా, 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం రాత్రి అందిన సమాచారం మేరకు ప్రకటించిన ఫలితాల్లో వైసీపీ 404 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది. టీడీపీ 5 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. చాలా జిల్లాల్లో

వైసీపీ జెడ్పీటీసీలను క్లీన్‌ స్వీప్‌ చేసింది. అలాగే 6,484 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలను ప్రకటించగా, వైసీపీ దాదాపు 5,462 స్థానాల్లో, టీడీపీ 690 స్థానాల్లో విజయం సాధించాయి. సీపీఐ తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. సీపీఎం, కాంగ్రెస్‌, బీజేపీ, జనసేన పార్టీల అభ్యర్థులు కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందారు.
వైసీపీ జెడ్పీటీసీ క్లీన్‌ స్వీప్‌ జిల్లాలు ఇవీ : నెల్లూరుతోపాటు చాలా జిల్లాల్లోని జెడ్పీటీసీలను వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. నెల్లూరులో 46 జెడ్పీటీసీలకు వైసీపీ అభ్యర్థులు 46 జెడ్పీటీసీలను, చిత్తూరు జిల్లాలో 63 జెడ్పీటీసీలకు 63 స్థానాలనూ కైవసం చేసుకున్నారు. కర్నూలు జిల్లాల్లో 52 స్థానాలకుగాను 52 స్థానాల్లోనూ, శ్రీకాకుళం జిల్లాల్లో 37 జెడ్పీటీసీలకుగాను 37 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. విజయనగరం జిల్లాల్లో 34 జెడ్పీటీసీలకుగాను 34 స్థానాలనూ, ప్రకాశం జిల్లాలో 55 జెడ్పీటీసీలలో 55 స్థానాలనూ, గుంటూరు జిల్లాలో 53 జెడ్పీటీసీలకు 53 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
ఇక వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం, కృష్ణా జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు అత్యధికంగా జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకున్నారు. అలాగే విజయనగరం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాలలో వైసీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ ఆధిక్యతను చూపింది. నారావారిపల్లి ఎంపీటీసీ స్థానాన్ని, కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ చేజిక్కించుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img