Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పరిహారంలో వివక్షా?

రూ.25 లక్షలు ఇవ్వాల్సిందే
సీపీఐ రాష్ట్రకార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్రబ్యూరో`అనంతపురం/ తనకల్లు : బాధితులకు పరిహారం అందించడంలో వివక్ష ఎందుకని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. విశాఖ ప్రమాదం మృతులకు కోటిరూపాయలు ప్రకటించిన జగన్‌…అనంతపురం జిల్లా మృతులకు ఐదు లక్షలా అని నిలదీశారు. కదిరిలో మృతిచెందిన వరద బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల వంతున పరిహారం చెల్లించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ పంటదెబ్బతిన్న రైతుకు ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కదిరిలో నాలుగంతస్థుల భవనం కూలి ఆరుగురు మృతి చెందితే రూ.5లక్షల పరిహారంతో సరిపెట్టడం సరికాదన్నారు. కదిరి పట్టణ ప్లానింగ్‌ అధికారుల అవినీతి కారణంగా భవననిర్మాణాల నాణ్యత దెబ్బతింటుందన్నారు. అనుమతులు లేకుండా అనేక భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. వరదలతో సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రామకృష్ణ వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు హరినాథరెడ్డి, సీపీఐ జిల్లా సహాయక కార్యదర్శి పి.నారాయణస్వామి, రైతు సంఘం నాయకుడు కాటమయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వేమయ్య యాదవ్‌, తదితరులు ఉన్నారు.
రాయలసీమ జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లిందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. తనకల్లు మండల పరిధిలోని మండ్లిపల్లిలో వరి, వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు.
పెట్టుబడులు, పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలకు చెరువులు దెబ్బతిన్నాయి. పంటలు, ఇళ్లు తిన్నాయి.
పెద్దసంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇసుక మాఫియా, అధికారుల కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు దెబ్బతిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు సురేంద్రనాథ్‌, రెడ్డప్ప, మధు నాయక్‌, హనుమంత్‌రెడ్డి, లక్ష్మీ ప్రసాద్‌, శ్రీరాములు, రామ్మోహన్‌, సూర్యనారాయణ రెడ్డి, ఆదినారాయణ, చౌడప్ప యాదవ్‌, మల్లికార్జున పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img