Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పరువునష్టం కేసుపై రాహుల్‌ అప్పీల్‌

నేడు సూరత్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌

న్యూదిల్లీ/సూరత్‌ : పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ… ఆ తీర్పుపై అప్పీలు చేయబోతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. దోషిత్వ నిర్ధారణ, శిక్ష విధింపుపై సోమవారం సూరత్‌ సెషన్స్‌ కోర్టులో రాహుల్‌ సవాల్‌ చేయబోతున్నట్లు వెల్లడిరచాయి. మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని, దోషిత్వ నిర్ధారణ తీర్పును తాత్కాలికంగా నిలిపేయాలని కోరబోతున్నట్లు తెలిపాయి. ఇదే విషయాన్ని రాహుల్‌ తరపు న్యాయవాది కిరీట్‌ పన్వాలా కూడా సూరత్‌లో ధృవీకరించారు. రాహుల్‌గాంధీ సోమవారం సూరత్‌ వస్తున్నారని, తన తీర్పుపై సెషన్స్‌ కోర్టులో అప్పీల్‌ చేస్తున్నారని వెల్లడిరచారు. సెషన్స్‌ కోర్టులో ఆయన స్వయంగా హాజరవుతారని చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సెషన్స్‌ కోర్టులో అప్పీలును దాఖలు చేస్తారన్నారు. రాహుల్‌గాంధీ వెంట పార్టీ సీనియర్‌ నేతలు కూడా సూరత్‌ రానున్నారు. కోర్టు తీర్పుతో రాహుల్‌ తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. రాహుల్‌ గాంధీ 2019లో కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ దొంగలందరికీ ఇంటి పేరు మోదీ ఎలా ఉంటోందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సూరత్‌ కోర్టు రాహుల్‌ గాంధీని దోషిగా పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 30 రోజుల పాటు బెయిలు మంజూరు చేసింది. అనంతరం ఆయన లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని పార్లమెంటు సచివాలయం ప్రకటించింది. అయితే ఈ కోర్టు తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం రాహుల్‌ గాంధీకి ఉంది. రాహుల్‌ గాంధీ దోషి అని మేజిస్ట్రేట్‌ ఇచ్చిన తీర్పును ఉన్నత న్యాయస్థానాలు నిలిపివేయకపోతే, ఎన్నికల కమిషన్‌ ఆయన ప్రాతినిధ్యం వహించిన కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించవలసి వస్తుంది. రానున్న ఎనిమిదేళ్లపాటు ఆయన ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంటు సచివాలయం రద్దు చేయడంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు తప్పుబడుతున్నాయి. చెల్లాచెదురుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యేందుకు ఇదొక అవకాశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img